వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్ గా మారింది:మంత్రి లోకేష్

Spread the love

వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని  వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్ గా మారిందని  విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. మండలి వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు లేవని చెబుతున్నారు. 2020- 2021 ఏడాది క్యూ-4 పెండింగ్ 683.1 కోట్లు, 2023-24 క్యూ-2, క్యూ-3, క్యూ-4 బకాయిలు 1753.98 కోట్లు, 2023-24 ఏడాది గమనిస్తే.. ఎంటీఎఫ్ ఎరియర్లు కానీ చూస్తే సుమారు రూ.895 కోట్లు బకాయిలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించినట్లు సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం మారే సమయంలో రూ.645 కోట్ల బకాయిలు చెల్లించలేదు. నేను రికార్డెడ్ గా చెబుతున్నాను. విద్యాశాఖ మంత్రిగా మాట్లాడేందుకు నాకు హక్కు ఉంది. వైసీపీ రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి వెళ్లారు. దీనిని నేను టేబుల్ చేస్తాను. మీరు రెడీగా ఉన్నారా అని వైసీపీ సభ్యులను నిలదీశారు. దీనిపై బొత్స స్పందిస్తూ.. వైసీపీ హయాంలో రూ.4వేల కోట్ల బకాయిలు లేవని, రెండు వాయిదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇంటర్ విద్యను పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ సభ్యులు అబద్దాలు చెప్పి బయటకు వెళ్తున్నారు. ఇంటర్ విద్యపై దృష్టి పెట్టడం లేదంటున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 70వేల మంది విద్యార్థులు పెరిగారు. అదీ కూటమి  ప్రభుత్వ చిత్తశుద్ధి. వైసీపీ ఐదేళ్ల కాలంలో కనీసం పుస్తకాలు బ్యాగ్స్ ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనం రద్దు చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదు. మేం ఇంటర్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్దరించామన్నారు.  పుస్తకాలు ఇస్తున్నాం. 10, ఇంటర్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నాం. వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్. ఈ తలుపు నుంచి వెళ్తారు. హాయిగా టీ తాగి ఆ తలుపు నుంచి వస్తారు. చిత్తశుద్ధి ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే సమాధానం ఇస్తున్నాం. సమస్యలు లేవని మేం చెప్పడం లేదు. మేం వినేందుకు సిద్ధంగా ఉన్నాం. పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.