ఈ ఏడాది సినీ క్యాలెండర్‌ను గమనిస్తే పండగ సీజన్లు దాదాపుగా ముందుగానే బుక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సంక్రాంతి నుంచి క్రిస్మస్ వరకూ ఉన్న ప్రధాన ఫెస్టివల్ డేట్స్‌పై పెద్ద సినిమాలు ఇప్పటికే కర్చీఎఫ్ వేయడం తో, మిగతా చిత్రాలకు ఇప్పుడు లాంగ్ వీకెండ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయ్. అదృష్టవశాత్తూ ఈ సంవత్సరం లాంగ్ వీకెండ్స్ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండటంతో, నిర్మాతలంతా వాటిపైనే దృష్టి సారిస్తున్నారు. ప్రేక్షకుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ సమయాల్లో విడుదలైతే మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కీలక చిత్రాలు తమ విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న, అలాగే పెద్ది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు తేదీలు కూడా లాంగ్ వీకెండ్స్ కావడం విశేషం. తాజాగా నాని హీరోగా రూపొందుతున్న ది ప్యారడైజ్ చిత్రం ఆగస్ట్ 21ను టార్గెట్ చేస్తూ మరో కీలక స్లాట్‌ను సొంతం చేసుకుంది. ఈ తేదీ ప్రత్యేకత ఏమిటంటే: ఒకటి కాదు, వరుసగా రెండు లాంగ్ వీకెండ్స్‌ను ఉపయోగించుకునేలా ప్లానింగ్ ఉండటం. దీంతో బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది.
ఇంకా కొన్ని సినిమాల విడుదల తేదీలు మాత్రం స్పష్టతకు రాలేదు. ఉదాహరణకు లెనిన్, డెకాయిట్ చిత్రాలు ఎప్పుడు వస్తాయో అధికారిక ప్రకటన లేదు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ డేట్ కూడా ఇంకా ఖరారు కాలేదు. వీటితో పాటు వెంకటేష్ ఆదర్శ కుటుంబం వంటి ప్రాజెక్టులు కూడా లైన్లో ఉండటంతో, మిగిలిన మంచి వీకెండ్స్‌పై పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.ఈ పరిస్థితిలో నిర్మాతలు త్వరగా నిర్ణయం తీసుకోవడం అత్యంత కీలకం. ఎందుకంటే మిగిలిన రెండు లేదా మూడు మంచి వీకెండ్స్ కూడా త్వరలోనే నిండిపోయే అవకాశముంది. ఒకవేళ అవి కూడా ఫిక్స్ అయిపోతే, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రవితేజ వంటి హీరోల కొత్త సినిమాలకు సరైన విడుదల తేదీలు దొరకడం కష్టమయ్యే పరిస్థితి తలెత్తుతుంది. అందుకే ఈ ఏడాది బాక్సాఫీస్ పోరు కేవలం కథల మధ్య పోటీ మాత్రమే కాకుండా సరైన తేదీ కోసం జరిగే వ్యూహాత్మక పోటీగా కూడా మారిపోయింది.