పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా 5,500 ఈ-సైకిళ్లు పంపిణీ

Spread the love

పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా 5,555  ఈ -సైకిళ్లను పంపిణీ చేశారు.  లబ్దిదారులు కొందరితో  కలిసి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద నిర్వహించే ప్రజావేదిక వరకూ సీఎం చంద్రబాబు నేడు ర్యాలీ నిర్వహించారు. ఇ-మోటరాడ్ అనే సంస్థ తయారు చేసిన ఈ ఇ-సైకిళ్లను 24 గంటల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు అందించడం గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ -సైకిళ్లను కుప్పంలోని యూనిట్ లో అసెంబ్లింగ్ చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…కుప్పంలో 5555 సూపర్ ఇ-సైకిళ్లను మహిళలకు అందచేశాం. గతంలో ఒకేసారి పెద్దమొత్తంలో సైకిళ్లను డెలివరీ చేసిన రికార్డును తుడిచి పెట్టి కుప్పంలో చరిత్ర సృష్టించామన్నారు. ఇ-సైకిళ్ల వల్ల రాబోయే కాలంలో ఎంతో ఉపయోగం ఉంటుంది.ఇ-సైకిళ్లకు సూపర్ సైకిల్ అనే పేరు పెట్టామన్నారు. 60 కిలో మీటర్ల వరకు ఈజీగా సైకిల్ మీద వెళ్లి పని చేసుకోవచ్చని తెలిపారు. సైకిల్ ఎక్కడికైనా దూసుకెళ్తుంది అదే ఈ సూపర్ సైకిల్ అని పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేశారు.ఇప్పుడు ఆ సైకిల్ ద్వారా మీ ఆరోగ్యం బాగుండేలా చూస్తున్నాం.కాలుష్యం తగ్గించేలా కృషి చేస్తున్నామన్నారు. ఇది కేవలం రికార్డ్ కాదని కుప్పం అభివృద్ధిలో సరికొత్త ప్రయాణమని అన్నారు. కాలుష్య రహితంగా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎప్పుడూ కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేయాలని  అప్పుడే అభివృద్ధి జరుగుతుంది, ఫలితాలు అందరికీ దక్కుతాయని పేర్కొన్నారు.