సరికొత్త సాంకేతిక విప్లవానికి కీలక అడుగు..దేశానికే గేమ్ ఛేంజర్ గా క్వాంటం కంప్యూటింగ్ సెంటర్

Spread the love

అమరావతి వేదికగా సరికొత్త సాంకేతిక విప్లవానికి కీలక అడుగు పడింది. క్యాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం సి చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తో కలిసి నేడు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్ర భవిష్యత్తు అంతా విద్యార్థులపైనే ఆధారపడి ఉందని ఆశలన్నీ వారిపైనే. చరిత్ర రాయాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా యువతకే సాధ్యమని పునరుద్ఘాటించారు. మన యువత టెక్నాలజీలో  క్వాంటం వేగంతో దూసుకెళ్తోందన్నారు. క్వాంటమ్ ప్రాజెక్టుకు ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. భవిష్యత్తులో ఇక్కడి నుంచే ఉత్పత్తి, సరఫరా చేస్తామన్నారు. హైటెక్ సిటీ హైదరాబాద్ కు గేమ్ ఛేంజర్ గా  మారిందని అయితే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ ఛేంజర్ కానుందని స్పష్టం చేశారు. ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అందించే అవకాశాలు ఇక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే 40 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టినట్లు వివరించారు.

దేశానికి సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారన్నారు.  టీసీఎస్, ఐబీఎం, ఎల్అండ్ ప్రతినిధులతో మాట్లాడి  ఒకట్రెండు నెలల్లోనే ఒప్పందాలు పూర్తి కావాలని కంపెనీలను కోరినట్లు తెలిపారు.  ఈ ఏడాది చివరి నాటికి మొదటి క్వాంటమ్ కంప్యూటర్ రావాలని చెప్పినట్లు తెలిపారు. ఇక  ఏప్రిల్ 14న ఇక్కడ మరో రెండు క్వాంటమ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.  2030లోగా 2.5 లక్షల మంది క్వాంటమ్ నిపుణులు కావాలని  దేశంలోని వందమంది ఐటీ నిపుణుల్లో 35శాతం మంది తెలుగువాళ్లేనన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలు ఏపీకి గేమ్ ఛేంజర్లు. క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేసిన ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందని  అమరావతి కూడా కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. ఐటీశాఖను మంత్రి లోకేశ్ సమర్థంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈనెల 16న బిల్ గేట్స్  అమరావతికి వస్తున్నారని  సీఎం తెలిపారు.చంద్రబాబు ఆలోచనలు, నిర్ణయాలు ఎల్లప్పుడూ రాబోయే తరాల అభివృద్ధిని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉంటాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కొనియాడారు. ఈ  కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నారాయణ, కందుల దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.