రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి రైల్ కనెక్టివిటీ, తెలంగాణా, కర్నాటక, చత్తీస్ ఘడ్ , మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హింటర్ ల్యాండ్ నుంచి రైల్ రవాణాపై సమీక్షలో చర్చించారు. రాయలసీమ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ, విశాఖ, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట తదితర రైల్వే జంక్షన్లలో రద్దీ తగ్గించే అంశంపైనా సమీక్షలో మాట్లాడారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ పెంచడంపై సమావేశంలో విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్-కొవ్వూరు సహా రాష్ట్రంలో వివిధ కొత్త రైల్వే మార్గాలకు సంబంధించిన ప్రతిపాదనలపైనా సీఎం సమీక్షించారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్-చెన్నయ్, చెన్నయ్-బెంగళూర్, హైదరాబాద్-బెంగళూరు లైన్లను హై స్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు.