ఏపీ లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. ఈరోజు జరిగిన భీమవరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ‘జంగల్ రాజ్’ నడుస్తోందని ఆరోపించారు. ‘దోచుకో, పంచుకో, తినుకో’ అనే రీతిలో పాలన సాగుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ అబద్ధాలేనని తేలిపోయిందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతోందని ఈ రెండేళ్లలో రైతులు, మహిళలు, యువత సహా ఏ ఒక్క వర్గానికైనా మంచి జరిగిందా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారని మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి ప్రతి హామీని నెరవేర్చిన పాలన తమదేనని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు హామీలను గాలికొదిలేశారని ఆక్షేపించారు. ఎన్నికలప్పుడు బాండ్లు పంచిపెట్టి ప్రజలను దగా చేశారు. ఇలాంటి మోసాలు చేసే వారిపై 420 కేసులు పెడతారు. కానీ చంద్రబాబు, ఆయన కూటమి నేతలు మాత్రం బయట తిరుగుతున్నారని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి రాజ్యమేలుతోందని ఫైర్ అయ్యారు. మద్యం ఇసుక వంటి అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని జగన్ ఆరోపించారు. ఇటీవల సంక్రాంతి పండుగను జూదం, అశ్లీల నృత్యాలతో భ్రష్టు పట్టించారని, ఇది జంగల్ రాజ్ కాకపోతే మరేమిటని దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశాన్ని ప్రస్తావించారు. పలువురు టీడీపీ నేతలపైనా విమర్శలు చేశారు. ఇంకో ఏడాదిన్నరలో తన పాదయాత్ర మొదలవుతుందని సుమారు 150కి పైగా నియోజకవర్గాల్లో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తానని జగన్ ప్రకటించారు. కళ్లు తెరిచి మూసేలోగా మూడేళ్లు గడిచిపోతాయి. నా పాదయాత్ర మొదలైతే ప్రజల్లోనే ఉంటాను. చంద్రబాబు ప్రభుత్వ అన్యాయాలను ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేలా చేయాలని కార్యకర్తలు కలిసి ఉండి, అనుబంధ విభాగాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రథమ స్థానం ఉంటుందని స్పష్టం చేశారు.