ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2019-20 నుంచి 2023-24 మధ్య కాలానికి సంబంధించి డిస్కంలు వసూలు చేయాల్సిన రూ.4,497.89 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా, తానే భరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (APERC) కి ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, నిర్వహణ ఖర్చుల సర్దుబాటు కోసం డిస్కంలు మొత్తం రూ.14,207 కోట్ల వసూలుకు ప్రతిపాదించగా, కమిషన్ వడపోత తర్వాత రూ.4,497.89 కోట్లు ఖరారయ్యాయి. ఎన్నికల హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన కూటమి ప్రభుత్వం, ఈ వేల కోట్ల భారాన్ని ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాలని నిర్ణయించడం గమనార్హం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని కోట్లాది మంది వినియోగదారుల నెలవారీ కరెంట్ బిల్లులపై అదనపు భారం తప్పింది. అభివృద్ధి మరియు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.