జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్న అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి యర్రాజీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రూ.30.35 లక్షల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అందజేశారు. కామన్వెల్త్, ఆసియా క్రీడలకు సన్నద్ధమవుతున్న ఆమెకు శాప్ తరపున ఈ మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు. జ్యోతి తన కుటుంబ సభ్యులు, శాప్ చైర్మన్ రవి నాయుడితో పాటు ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిశారు. ఇటీవల సౌత్ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ అందుకున్న ఆమెను మంత్రి అభినందించారు. ప్రభుత్వం తరపున అన్నివిధాలా అండగా ఉంటామని ఆమెకు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఇక మంగళగిరికి చెందిన వెయిట్ లిఫ్టర్ బొల్లినేని చంద్రిక కూడా మంత్రి లోకేష్ ను కలిశారు. ఇటీవల ఇస్తాంబుల్ లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ సాధించిన ఆమెను మంత్రి అభినందించారు.