4 రికార్డులు సృష్టించిన బెంగళూరు-విజయవాడ నేషనల్ హైవే 

Spread the love

బెంగళూరు- విజయవాడ వయా కడప నేషనల్ హైవే నిర్మాణంలో రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించింది. తాజాగా  వర్చువల్ గా ఏపీ సీఎం  చంద్రబాబు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గిన్నిస్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ రికార్డు నెలకొల్పడాన్ని నితిన్ గడ్కరీ, చంద్రబాబు ప్రశంసించారు. ఈ నెల 5న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాతర్లపల్లి వద్ద ఈ ప్రయత్నాలను నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఈ నెల 6 బొంతలపల్లి సమీపంలో 28.89 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని 24 గంటల్లోపు పూర్తి చేసి ఫస్ట్  రికార్డు నమోదు చేసింది. అలాగే 24 గంటల్లో అత్యధికంగా 10,655 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ను  (బీటీ) నిరంతరం వేసి రెండో రికార్డు సాధించింది. ఈ నెల 11 వరకు 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ను  నిరంతరంగా వేసి మూడో రికార్డును.సృష్టించింది. మొత్తం 156 లేన్ కిలోమీటర్ల (26 కిలోమీటర్ల మేర 6 లైన్) పొడవైన హైవేని  నిరంతరంగా నిర్మించి 4వ  రికార్డును సృష్టించింది. ఈ రికార్డ్ పై స్పందిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇది చైనా కాదు, జర్మనీ కాదు, అమెరికా కూడా కాదు. ఇది రోడ్ల నిర్మాణంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న నవ భారతం, అది కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లో బి.కె.వి (BKV) కారిడార్‌లో 156 లేన్ కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించి, 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను వేయడం ద్వారా, కేవలం ఒక్క వారంలోనే నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించిన NHAI మరియు రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్‌లకు హృదయపూర్వక అభినందనలు అంటూ రాసుకొచ్చారు.