శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ఏపీ సీఎం చంద్రబాబు  సమీక్ష

Spread the love

శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ఏపీ సీఎం చంద్రబాబు  సమీక్షనిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ, సౌకర్యాలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి రివ్యూ చేశారు. అధికారులు, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను, సౌకర్యాలను సమీక్షించారు. శివరాత్రి నాటికి శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  దేవాదాయ శాఖ మంత్రి ఆనం, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్దతో ఏర్పాట్లు, వసతులపై అధికారులతో పర్యవేక్షించాలని సూచించారు. 

భక్తులకు ఇబ్బంది కలగకుండా, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, వసతి లభించేలా కార్యచరణ అమలు చేయాలన్నారు. దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులకు ఇబ్బంది కలిగేలా, అగౌరపరిచేలా ఎవరూ వ్యవహరించ కూడదని సీఎం ఆదేశించారు. రోజు రోజుకూ దేవాలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. శివరాత్రి పర్వదినం వంటి సందర్భాల్లో అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు సీఎం ఆదేశించారు.