బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దాదాపు 20 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. సదుం(మం) పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లిలో కోళ్ల ఫారాలను నిర్వహిస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత వారం రోజుల లో క్రమేపి కోళ్లు చనిపోతున్న తరుణంలో అధికారులు పరీక్షలు నిర్వహించి కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు సదుం మండల తహసీల్దార్ ప్రమీల తెలిపారు. కోళ్ల ఫారం నిర్వహిస్తున్న రైతులతో చర్చించి తాత్కాలికంగా మూడు కోళ్ల ఫారాలను సీజ్ చేసినట్లు తెలిపారు. చనిపోయిన కోళ్లతో పాటు మిగిలిన కోళ్లను కూడా ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఊరి పొలిమేర్లలో జెసిబి సాయంతో గుంతలు తీసి కోళ్లను పూడ్చి పెట్టారు. ఒక్కసారిగా కోళ్లు మృతి చెందడంతో రైతులు నిరాశ చెందారు. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లకు నష్టపరిహారం. చెల్లిస్తామని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పలు కోళ్ల ఫారాలలో బర్డ్ ఫ్లూ వ్యాధిని గుర్తించినట్టు ఆయన అన్నారు. కోళ్లను ఖననం చేసేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.