2026-27 కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేటాయించిన రేర్ ఎర్త్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ కార్యక్రమాలను అనుసంధానం చేసుకుంటూ అదనపు నిధులు సాధించాలని సూచించారు. కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్ ను శ్రీకాకుళం- విజయనగరం-విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులోనూ తీరప్రాంతంలో ఉన్న మూలపేట నుంచి దిగువున కృష్ణపట్నం వరకూ ప్రతిపాదించాలన్నారు. కంటైనర్ మాన్యుఫాక్చరింగ్, ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన ఏర్పాటు చేసుకునేలా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. మెగాటెక్స్ టైల్ పార్కును పల్నాడు ప్రాంతంలోనూ, స్పోర్ట్ మాన్యుఫాక్చరింగ్ హబ్ తిరుపతిలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఇండియా సెమికండక్టర్ మిషన్ 2.0 లో భాగంగా సెమీ కండక్టర్ డిజైన్ తదితర ప్రాజెక్టులను అమరావతిలో ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. వీటితో పాటు రాజధాని ప్రాంతంలోని హెల్త్ సిటీలో బయోడిజైన్, మెడ్ టెక్ పార్క్, బయో ఫార్మా శక్తి మిషన్ లాంటి ఎకోసిస్టం వస్తుందని తెలిపారు. మెడికల్ టూరిజం- హీల్ ఇన్ ఏపీ అన్న విధానంలో అమరావతిలో ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. హిందుపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీని ప్రతిపాదించాలన్నారు. తిరుపతిని టూరిజం డెస్టినేషన్ కింద అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందన్నారు. కేంద్రం మంజూరు చేసిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను సద్వినియోగం చేసుకుని మరిన్ని ఇ-బస్సులను సాధించేలా ప్రణాళిక చేయాలని కొబ్బరి, కోకో, కాజు, కాఫీ పంటలకు ఎక్కువ నిధులను సాధించుకునే అవకాశం ఉందని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ఆస్కారం ఉన్నట్లు వివరించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారు లు పాల్గొన్నారు.