బిచ్చగాడి మృతదేహం దగ్గర భారీగా నగదు.. ఆశ్చర్యపోయిన అధికారులు   

Spread the love

కేరళలోని అలప్పుజలో వెలుగు చూసిన ఒక ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది.  రోడ్డు యాక్సిడెంట్ లో  మరణించిన ఓ బిచ్చగాడి వద్ద ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు దొరకడం స్థానికులు, అధికారులను  ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. చారుమ్మూడ్ అనే ప్రాంతంలో అనిల్ కిషోర్ అనే వ్యక్తి భిక్షాటన సాగిస్తూ జీవనం గడిపేవాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని హాస్పిటల్ కు తరలించారు. అయితే, ఎవరికీ ఏమీ చెప్పకుండా అతడు హాస్పిటల్  నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఓ షాప్  ముందు ప్రాణం లేకుండా  కనిపించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని  పోస్టుమార్టం కోసం తరలించి, అతడి సమీపంలో దొరికిన ఓ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కంటైనర్‌ను తెరిచి చూసి ఆశ్చర్యపోవడం అధికారులవంతైంది. అందులో ప్లాస్టిక్ డబ్బాల్లో నింపిన కరెన్సీ నోట్ల కట్టలు ఉన్నాయి. మొత్తం రూ.4.5 లక్షలకు పైగా నగదుతో పాటు రద్దయిన రూ.2000 నోట్లు, విదేశీ కరెన్సీ కూడా ఉన్నట్టు గుర్తించారు. అతడి దగ్గర అంత డబ్బు ఉందని ఎవరూ ఊహించలేదని స్థానికులు చెబుతున్నారు.