మరో ఇద్దరు అనాథ చిన్నారులకు డిప్యూటీ సీఎం ఆసరా అందించనున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 42 మంది అనాథ చిన్నారులకు తన జీతం మొత్తాన్ని ఆర్ధిక సాయం రూపంలో అందిస్తున్నడిప్యూటీ సీఎం పవన్ తాజాగా మరో ఇద్దరు చిన్నారుల బాధ్యతను స్వీకరించారు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయారు. ఉండటానికి ఇల్లు కూడా లేక ఇబ్బందిపడుతున్న వారు డిప్యూటీ సీఎం పవన్ కు తమ దుస్థితిని వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో సందేశం పంపారు. ఆ చిన్నారుల వేదన పవన్ ను కదిలించింది. ఆ చిన్నారులకు ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున ఇద్దరికీ రూ. 10 వేలు అందించాలని తన కార్యాలయ అధికారులని ఆదేశించారు. ఏ ఆధారం లేని చిన్నారులకు తక్షణం ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇద్దరు చిన్నారులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీల్లో చేర్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆ బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్ కు అప్పగించారు.ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.