ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి పంపిణీ చేస్తోంది. కాగా, నర్సీపట్నం స్థానిక మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, ఇష్టారాజ్యంగా పాస్ పుస్తకాలు ముద్రించి,రైతులను ఇబ్బందులకు గురిచేశారని, తాతల తండ్రుల నాటి నుంచి వస్తున్న రైతుల భూములకు, పాలకుల ఫోటోలు ముద్రించడం ఏంటని, ఈ విధానానికి స్వస్తి పలుకుతూ, కూటమి ప్రభుత్వం కేవలం ‘రాజముద్ర’ తో కూడిన పుస్తకాలను తీసుకువచ్చిందని రైతు సోదరులకు తెలిపారు. కొత్తగా ఇస్తున్న పాస్ పుస్తకాలలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించామని, ప్రతి పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ కోడ్ స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయని తెలిపారు. దీనివల్ల రికార్డుల ట్యాంపరింగ్, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని వెల్లడించారు.