ఆగష్టులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారంటూ..?!

Spread the love

YSRCP Chief Jaganmohan Reddy: ఆగష్టులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారంటూ వస్తోన్న వార్తల్లో నిజం ఎంత. అసలు జగన్ అరెస్ట్ అనేది రాజకీయంగా ఇప్పుడున్న పరిస్తితుల్లో సాధ్యమేనా. అవసరాలకు అనుగుణంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నడుస్తున్న రాజకీయ పరిస్తితుల్లో, అన్నీ అనుకున్నట్లే జరుగుతాయా. తాజా పరిస్తితులు చూస్తుంటే కష్టమేనని చెబుతున్నాయట.

లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుపోయారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ కుంభకోణం మీద ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, పలు కీలక అంశాలను వెలుగులోకి తీసుకు రావడంతో ఆయన అరెస్ట్ దాదాపు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఇక దాదాపు 3 వేల 500 కోట్ల రూపాయల స్కాం జరిగిందన్న ఈ కేసులో విదేశీ ముడుపులు, హవాలా లావాదేవీలు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈడీ అధికారులు శర్వాణీ ఆల్కోబ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ చంద్రారెడ్డిని ప్రశ్నించనుంది.

ఓవైపు సిట్, మరోవైపు ఈడీ దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో జగన్ అరెస్ట్ అంశం తెరమీదకు వచ్చింది. ఆయన అరెస్ట్ పక్కా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపైనే ఏపీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, ఆయనతో పాటు వైసీపీ నుంచి గెలిచిన 10 ఎంఎల్ఏలు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తారనీ, ప్రజల్లో సానుభూతి కోసం పాదయాత్ర చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే జనంలో జగన్ మీద సానుభూతి పెరుగుతుందా, లేదా అన్నదే ఇప్పుడు ఏపీ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందట. YSRCP Chief Jaganmohan Reddy.

కూటమి ప్రభుత్వం ఇలా ఆలోచిస్తుందా లేదా అన్నది కాసేపు పక్కనపెడితే, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం వైపు మొగ్గుచూపుతుంది అన్నదే మరో ప్రశ్నగా మారిందట. ఎందుకంటే, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సెషన్సులో ఎనిమిది కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకోవాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా జియో రెలిక్స్, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లులు ఉన్నాయి. వీటి మీద ఉభయ సభల్లో పెద్ద చర్చే జరిగే అవకాశం ఉంది. అలాగే జస్టిస్ వర్మ అంశం కూడా పార్లమెంటును కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్క పార్టీ మద్దతు ఉభయ సభల్లో అవసరం.

కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి లోక్ సభలో ఎదురులేదు. అసలు చిక్కల్లా రాజ్యసభలోనే ఉంది. ప్రస్తుతానికి రాజ్యసభలో ఎన్డీయేకు స్వల్ప మెజార్టీ ఉంది. బీజేపీకి సొంతంగా 96 మంది ఎంపీలతో కలిపి ఎన్డీయేకు 119 మంది ఎంపీల సంఖ్యా బలం ఉంది. అంటే సభలో బిల్లు అమోదానికి కావాల్సిన 117 మంది ఎంపీల కంటే ఇద్దరు ఎక్కువగా ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో బలం పెరిగితేనే కొన్ని బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. ఇక రాజ్యసభలో వైసీపీకి ఏడుగురు ఎంపీలు ఉన్నారు. వీరి మద్దతు కేంద్ర ప్రభుత్వానికి చాలా కీలకం కానుంది. కేవలం బిల్లుల విషయంలోనే కాదు, అటు ఉప రాష్ట్రపతి ఎన్నికలో కూడా వైసీపీ మద్దతు కేంద్రానికి కీలకంగా మారనుంది.

అంతేకాదు, బీజేపీ నిర్ణయాలు, వ్యూహాలను అంచనావేయడం అంత సులువుకాదట. ఎందుకంటే, గతంలో చాలా సందర్భాల్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వైసీపీ అండగా నిలబడింది. పలు వివాదాస్పద బిల్లులకు వైసీపీ మద్దతు పలికింది. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అన్న ప్రచారం మీద అనుమానాలు రావడం ఖాయంగా కనిపిస్తోందన్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.

Also Read: https://mega9tv.com/andhara-pradesh/jammalamadugu-bhupesh-reddy-is-also-haunted-by-the-pain-that-his-importance-in-the-constituency-will-decrease-as-the-cadre-also-gathers-around-adinarayana-reddy/