మన భాషను మనం గుర్తించకుంటే, ఎవరు గుర్తిస్తారు:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

Spread the love

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు  శుభాకాంక్షలు తెలిపారు. మన అస్తిత్వానికి సుస్థిరమైన కోటను నిర్మించేది మన మాతృభాషేనని అన్నారు. భవిష్యత్ తరాలు అసలు ‘నీవెవరు..?’ అని ఒక ప్రశ్న అడిగినప్పుడు, మనకంటూ గర్వంగా చెప్పుకోవడానికి ఓ సమాధానం మన భాష, సంస్కృతులేనని పేర్కొన్నారు.  భవిష్యత్ తరాలకు మన భాషా సంస్కృతులను అందించాలన్నా, మనదైన సంస్కృతికి ఒక ప్రత్యేకతను కల్పించాలన్నా మన భాషను మనం కాపాడుకుని తీరాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మన భాషను మనం గుర్తించకుంటే, ఎవరు గుర్తిస్తారు. మన భాషను మనం అభివృద్ధి చేసుకోకపోతే ఎవరు చేస్తారు. భాషను కాపాడుకోవడం అనే అంశాన్ని అనేక కోణాల్లో ఆలోచించి అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని  తల్లిదండ్రులు మాతృభాష పట్ల మమకారం కలిగి ఉండాలని సూచించారు.  ఉపాధ్యాయులు విద్యార్థుల్లో మాతృభాష పట్ల ప్రేమను పెంచాలన్నారు. ప్రభుత్వాలు మాతృభాషలో చదువుకున్న వారికి ఉద్యోగాల్లో సరైన అవకాశాలను పెంచాలని  అప్పుడు మాత్రమే మాతృభాష మనుగడ సాధ్యం అవుతుందని అన్నారు. ఇది తెలుగుకే కాదు, ప్రపంచంలోని అన్ని మాతృభాషలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. కావలసిందల్లా నిధులు, వనరులు మాత్రమే కాదు, మాతృభాష పట్ల నిజాయితీతో కూడిన శ్రద్ధ, నిబద్ధత, కార్యదీక్షలని వెంకయ్య సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *