కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

Spread the love

కాలుష్యాన్ని నివారించలేం… కానీ నియంత్రించవచ్చని ఏపీ డిప్యూటీ సీఎం,అటవీ పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అధునాతన సాంకేతికతతో వ్యర్ధాల నిర్వహణ చేపట్టాలన్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధితోపాటు కాలుష్యమూ పెరిగిపోయిందని పరిశ్రమల్లో 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. కాలుష్యం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిందని రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొంత వరకు కాలుష్యాన్ని భరించక తప్పని పరిస్థితి. అయితే కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నివారించలేకపోయినా నిలువరించి నియంత్రించే ప్రయత్నం అయితే జరగాలి. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాల’ని ఏపీ డిప్యూటీ సీఎం, అన్నారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తు.చ. తప్పక పాటిస్తూ జీవ వైవిధ్యానికి సహకరించాలని సూచించారు. నూతన సాంకేతికత సాయంతో వ్యర్థాల నిర్వహణ, గాలి నాణ్యత పెంపు తదితర చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోర్టు నుంచి పారిశ్రామికవాడల వరకు యాజమాన్యాలు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవహారంలో నిబంధనలు సరిగా పాటించవన్న భావన ప్రజల్లో బలంగా ఉందని పరిశ్రమల యాజమాన్యాలు సాటి మనుషుల పట్ల కనీస బాధ్యతతో స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పేర్కొన్నారు.