అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా మంత్రి నారాయణ మరియు స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అమరావతి మండలం కర్లపూడిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. కర్లపూడి మరియు లేమల్లె గ్రామాలకు సంబంధించి మొత్తం 2654 ఎకరాలకు కాంపిటెంట్ అధారిటీ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేయగా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి మరియు ఎమ్మెల్యేకు రైతులు ఘన స్వాగతం పలికారు. తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ కోసం ఎంపిక చేసినందుకు రైతులు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ కు ధన్యవాదాలు తెలియజేశారు. మొత్తం 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 4 గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. కర్లపూడిలో పూలింగ్ కొద్దిసేపటికే 65 మంది రైతులు సుమారు 354 ఎకరాలకు అంగీకార పత్రాలను అందజేయడం విశేషం. ఇదే క్రమంలో రైతుల విన్నపాన్ని మన్నించి, కర్లపూడి ప్రధాన రహదారిని నిర్మించేందుకు మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాజధానిపై జరిగిన “మూడు ముక్కలాట” వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. తాము గతంలో ఎన్నికలకు ఏడాది ముందే అమరావతి పనులు ప్రారంభించామని, ప్రస్తుతం 55 వేల కోట్ల రూపాయల వ్యయంతో పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అమరావతిలో ఎకనమిక్ యాక్టివిటీ పెరిగితే భూమి విలువ కూడా పెరుగుతుందని సీఎం భావిస్తున్నారని తెలిపారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ మరియు రైల్వే ట్రాక్ వంటి ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందునే, వారికి మేలు చేసే ఉద్దేశంతో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ఎంచుకున్నామని వివరించారు. ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైన మొదటి రోజే ఎండ్రాయిలో 300 ఎకరాలు, పెదమద్దూరులో 400 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని, కర్లపూడిలో కూడా అనూహ్య స్పందన లభించిందని అన్నారు. రైతులు అడిగినట్లుగా మూడేళ్లలో రాజధాని అభివృద్ధి పనులన్నీ ఖచ్చితంగా పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.