రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు శైవ క్షేత్రాలకు భారీ సంఖ్యలో పోటెత్తారు. శ్రీకాళహస్తీ, శ్రీశైలం, కోటప్పకొండ, పంచారామాలు సహా రాష్ట్ర వ్యాప్త శివాలయాల్లో పరమశివుని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ దర్శనం వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి క్షేత్రం వాయు లింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర క్షేత్రంలో లింగోద్భవ దర్శనం చేయడం ద్వారా సకల పాపాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆగమ శాస్త్ర ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి లింగోద్భవ ఘట్టాన్ని ఆవిష్కరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి పర్వదినం అత్యంత వైభవంగా జరిగింది .దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి శివనామస్మరణలో మునిగిపోయారు.మహా శివలింగానికి పంచామృతాభిషేకం, పసుపు–కుంకుమ అభిషేకాలు, అక్షింతలు, బిల్వపత్ర పుష్పాభిషేకం, విభూది అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపారు. ప్రతి అభిషేక సమయంలో ఆలయ ప్రాంగణం అంతా “ఓం నమః శివాయ” నినాదాలతో మార్మోగింది.విశేషంగా విదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.