జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొననున్నారు. జనసేన పార్టీ – భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ, 7 మరియు 8 తేదీలలో తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. జనసేన బీజేపీ ఇరు పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, స్నేహపూర్వక వాతావరణంలో క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యే దిశగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, NDA కూటమి తరపున ఈ ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొననున్నారు. ఈ ఎన్నికల ప్రచార షెడ్యూల్ రూట్ మ్యాప్ త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇక తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు పవన్ ను కలిశారు.