బంగ్లాదేశ్ లో గత 6 నెలలుగా నిర్బంధంలో ఉన్న 9 మంది ఏపీకి చెందిన భారత మత్స్యకారులు ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు. భారత కోస్ట్ గార్డ్స్ పర్యవేక్షణలో వీరు సురక్షితంగా విశాఖకు చేరారు. స్వస్థలాలకు చేరుకోవడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. గతేడాది అక్టోబర్‌లో బంగాళాఖాతంలో వేటకు వెళ్లిన వీరు, పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించడంతో ఆ దేశ నౌకాదళం వీరిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి వీరు అక్కడి జైలులోనే ఉన్నారు. భారత ప్రభుత్వం చొరవతో జనవరి 29న అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వద్ద బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వీరిని భారత కోస్ట్ గార్డ్ కు అప్పగించింది. అక్కడి నుంచి వీరిని విశాఖ మత్స్యకార నౌకాశ్రయానికి తీసుకువచ్చి, మెరైన్ పోలీసులకు అప్పగించారు. ఈ విడుదల రెండు దేశాల మధ్య కుదిరిన పరస్పర ఒప్పందంలో భాగంగా జరిగింది. బంగ్లాదేశ్ 23 మంది భారత జాలర్లను అందులో 9 మంది ఏపీ, 14 మంది పశ్చిమ బెంగాల్ కు చెందిన వారిని రెండు పడవలతో సహా విడుదల చేయగా, భారత్ కూడా తమ అదుపులో ఉన్న 128 మంది బంగ్లాదేశీ జాలర్లను, ఐదు పడవలను ఆ దేశానికి అప్పగించింది. తమను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాలర్లు, వారి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.