ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో చేనేత స్టాల్స్..ప్రారంభించిన స్పీకర్,డిప్యూటీ స్పీకర్

Spread the love

చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన ప్రత్యేక చేనేత స్టాల్స్ ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు నేడు ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇరువురూ మంత్రులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతి స్టాల్‌ను సందర్శించి, చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ “చేనేత వస్త్రాలు మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. చేనేత కార్మికుల శ్రమకు గౌరవం ఇవ్వాలంటే మనమంతా చేనేత వస్త్రాలను ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ స్టాల్స్ ఐదు రోజుల పాటు అసెంబ్లీ ప్రాంగణంలో అందుబాటులో ఉంటాయన్నారు. మంత్రులు, శాసన సభ్యులు, ఉద్యోగులు అంతా  ఈ చేనేత వస్త్రాలను పెద్దఎత్తున కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. తన సతీమణి కోసం రెండు చేనేత చీరలను స్వయంగా  స్పీకర్ కొనుగోలు చేసిన చేనేత కార్మికులను ప్రోత్సహించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా చేనేత ఉత్పత్తుల నాణ్యతను ప్రశంసించారు. రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ  దేశ వ్యాప్తంగా దాదాపు 120 చేనేత కార్మిక సంఘాలు ఉంటే, వాటిలో దాదాపు 35 సంఘాల వరకూ మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు.  చేనేత పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, స్థానిక చేనేతకార్మికుల ఉత్పత్తులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ స్టాల్ ల్లో విక్రయించే అన్ని ఉత్పత్తులను 40 శాతం  రాయితో విక్రయిస్తున్నటు ఆమె తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *