తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సీనియర్ నాయకులు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిశారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత… లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యచరణ, రెండేళ్ల ప్రజా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇటీవల గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సాధించిన ఫలితాల పై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయరంగంలో తెలంగాణ రైతులు సాధిస్తున్న విజయాలు, దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన విధానం గురించి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల గురించి శ్రీ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారని సీఎం రేవంత్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, పలువురు మంత్రివర్గ సభ్యులు పాల్గొన్నారు.