ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కుసీఎం చంద్రబాబు రేపు హాజరు కానున్నారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్, ఐఎఎస్ అధికారి వికాస్ మర్మత్ వివాహానికి హాజరయ్యేందుకు ఇవాళ సాయంత్రం సీఎం జైపూర్ కు బయల్దేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ నుంచి జైపూర్ కు బయలుదేరనున్నారు. జైపూర్ లోని వృందావన్ ప్యాలెస్ లో జరిగే వివాహానికి హాజరై రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం జైపూర్ నుంచి బయల్దేరి ఢిల్లీలో జరిగే ఇండియా ఇంపాక్ట్ ఏఐ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఏపీని టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొని అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం జైపూర్ నుండి ఢిల్లీకి చేరుకోనున్నారు. సీఎం భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ సమ్మిట్ వేదికకు వెళ్లనున్నారు. 9.30 గంటలకు ఏఐ యాక్సిలరేటర్స్, ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్‌లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి సీఎం పాల్గొనున్నారు. అనంతరం రాష్ట్రంలో ఏఐ ఇన్ఫ్రా స్ట్రక్చర్ , స్కిల్ డెవలప్మెంట్ కల్పనకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. అలాగే పలు బహుళ జాతి సంస్థల ప్రతినిధులు, సాంకేతిక ప్రముఖులతో కీలక కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.