సూపర్ సిక్స్ తో సుపరిపాలన అందించిన  కూటమి సూపర్ హిట్:మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 

Spread the love

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ తో సుపరిపాలన అందించి సూపర్ హిట్ కొట్టామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్న తనకు,  కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం గర్వకారణమని అన్నారు. తాజాగా ఆయన నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. తమ ప్రభుత్వ పాలనలో మీడియా కూడా ఎంతో కీలకంగా పనిచేస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయిందన్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

 కొత్త సంవత్సరంలో కూడా ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం, స్త్రీశక్తి పథకం,అన్నదాత సుఖీభవ పథకం, దీపం–2 పథకం, ఎన్‌టీఆర్ భరోసా ఫించన్ల వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా చేసిన పనులను వివరించారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించామని, ఎస్సీ వర్గీకరణ విషయంలో మాటలకే పరిమితమైన గత ప్రభుత్వాలకు భిన్నంగా, కూటమి ప్రభుత్వం చట్టం చేసి అమలు చేస్తుందని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ ద్వారా ఒకే రోజు 15,941 ఉద్యోగాలు, పోలీస్ శాఖలో 5,747 ఖాళీల భర్తీ చేశామని తెలిపారు. గత వైసీపీ పాలనలో మిగిలిపోయిన 84 లక్షల టన్నుల చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని, రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మత్తులు, రూ.3,000 కోట్లతో నూతన రోడ్ల పనులు చేపట్టామని వివరించారు. పారిశ్రామిక రంగంలో 23 కొత్త పాలసీలు తీసుకొచ్చామని, ప్రతి జిల్లాకు ఒక పోర్టు వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. వైజాగ్‌లో జరిగిన సమ్మిట్‌లో రూ.13.21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. ఆగమశాస్త్ర నియమాల మేరకు ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారాలను సరిచేశామని చెప్పారు. దేవాదాయ శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. వేద విద్యను ప్రోత్సహిస్తున్నామన్నారు. 492 పురాతన ఆలయాల్లో రూ.590 కోట్లతో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఆలయాలను ఎకో టెంపుల్ టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. కృష్ణపట్నం పోర్టును తిరుపతి జిల్లాకు తరలించాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం సరిచేసి, కృష్ణపట్నం పోర్టుతో పాటు వెంకటగిరి మూడు మండలాలు, గూడూరును నెల్లూరు జిల్లాలో కొనసాగించిందని చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా స్టేట్స్‌మన్‌గా గుర్తింపు పొందారని, ఆయనపై కేసీఆర్ విమర్శలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు.జిల్లాకు పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాకతో రామరాజ్యం ఆరంభమైందని, ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం ధీమా వ్యక్తం చేశారు.