2027 జనవరి 8, 9, 10 తేదీల్లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్ర సారస్వత పరిషత్తు, మారిషస్ తెలుగు మహాసభ అసోసియేషన్ల మధ్య నిన్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) జరిగింది. మూడో ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై ఈ ప్రక్రియ పూర్తిచేశారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి, సభల విజయవంతానికి ఈ ఎంఓయూ చేసుకున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. వేదికపై అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. తాజాగా గుంటూరు వేదికగా మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరిగాయి. మారిషస్ అధ్యక్షుడు గోకుల్, ఏపీ సీఎం చంద్రబాబు సహా దేశ విదేశాల ప్రముఖులు ఈ సభల్లో పాల్గొన్నారు. భారీ స్థాయిలో తెలుగు వారు ఈ సభల కోసం తరలి వచ్చారు.