ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయి: మాజీ సీఎం జగన్

Spread the love

విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావ‌డం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి అని మాజీ సీఎం జగన్ అన్నారు.  #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందని ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. 

ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌ కు  హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వైసీపీ  పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశామని జగన్ తెలిపారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్త‌యిందని స్పష్టం చేశారు. . ఆ రోజు తాము  చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచిందన్నారు. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన  నితిన్ గడ్కరీ కృషి, సహకారం తనకు ఎంతో గుర్తుందని జగన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.