సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. ఏడాదంతా తమ జీవనోపాధి కోసం పట్నం బాట పట్టిన వారంత తమ స్వస్థలాలకు వెళ్లి తమ వారితో గడపాలని ఈ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకునే ఈ పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతూ ఉంది. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్ లో రద్దీ పెరిగింది. దిల్ షుక్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక కూడళ్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండగా.. రైల్వే ప్రత్యేక రైళ్లతో ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది.