ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు నేడు కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలు తెలిపారు. నెయ్యి కల్తీ ఘటన ఆరోపణ కాదని అప్పటి పాలకులకు తెలిసే జరిగిందన్నారు. తెలిసి జరిగినా గత ప్రభుత్వం దీన్ని తొక్కి పెట్టిందని స్పష్టం చేశారు. 2022లో జరిగిన ఈ నేరం 2024 వరకు కొనసాగింది. నెయ్యి అని పిలుస్తున్న పదార్థం భోలేబాబా డెయిరీలో తయారు చేశారు. నెయ్యిలా మార్చేందుకు రకరకాల కెమికల్స్ కలిపారు. గతంలో తిరుమల లడ్డూలో నాణ్యత లేదు, సువాసన రాలేదని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నెయ్యి నూనెలా జారిపోతోందని అప్పట్లో పోటు కార్మికులు చెబితే ఆర్గానిక్ నెయ్యి అని వారికి అసత్యాలు చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విధి నిర్వహణలో భాగంగా ఈవో శ్యామలరావు నాలుగు ట్యాంకర్ల నెయ్యి శాంపిళ్లను ఎన్డీడీబీకి పంపారు. ఆ సంస్థ ఇచ్చిన నివేదికలో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయన్నారు. నెయ్యి కల్తీ జరిగిందని ఎన్డీడీబీ నివేదికలో తేలింది. సోయాబీన్, సన్ ఫ్లవర్, ఫిష్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, పామాయిల్, వెజిటెబుల్ ఆయిల్ కలిసినట్లు పేర్కొంది.జంతుకొవ్వు కలిసినట్లు నివేదికలో తెలిపింది. సీఎం ఆవేదనతో ఎన్డీబీబీ నివేదికను శాసనసభాపక్ష సమావేశంలో తెలిపారని పయ్యావుల కేశవ్ అన్నారు.