కోనసీమలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందడానికి ఈ నిర్ణయం దోహదం:ఏపీ సీఎం చంద్రబాబు 

Spread the love

జగ్గన్న తోట ప్రభల తీర్ధాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.  సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుక జగ్గన్న తోట ప్రభల తీర్థం. ప్రతి ఏటా కనుమ రోజు జగ్గన్న తోటలో జరిగే ఈ అతిపెద్ద పండుగలో 11 పురాతన శివాలయాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయి. తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్న కోనసీమ ప్రజల భక్తి, విశ్వాసాలను గౌరవిస్తూ… జగ్గన్న తోట ప్రభల తీర్ధాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.  సుమారు 5 లక్షల మంది హాజరయ్యే ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా చేయాలనే మంత్రివర్గ నిర్ణయంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారం అందుతుందని స్పష్టం చేశారు.  కోనసీమలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు.