ప్రతి గణతంత్ర దినోత్సవం గర్వించదగ్గ మరియు చిరస్మరణీయమైన సందర్భమే అయినప్పటికీ, ఈ ఏడాది వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనవి మరియు చిరకాలం గుర్తుండిపోయేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా రాజధాని అమరావతిలో మొట్టమొదటిసారిగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించడంతో, ఈ గణతంత్ర దినోత్సవం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ మహోన్నత సందర్భంలో ప్రభుత్వ అజెండాను మరియు దార్శనికతను అనర్గళంగా వివరించిన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మన సామూహిక ఆకాంక్షలను మరియు భవిష్యత్తు విజన్‌ను ప్రతిబింబించేలా సాగిన అద్భుతమైన పరేడ్ మరియు శకటాల ప్రదర్శనను వీక్షించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.
సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన ఈ శుభ దినోత్సవాన దేశ ప్రజలు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. మనల్ని మనం పాలించుకునేందుకు రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును ఘనంగా జరుపుకుందాం. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ మనకు ఇచ్చిన రాజ్యాంగం… ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పునాదులు వేసింది. ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ విలువలు కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని ఆకాంక్షించారు.