వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ను ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన పొగాకు రైతులు కలిశారు. కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు, సిగరెట్లపై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ పెంపుతో పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైయస్ జగన్ దృష్టికి తెచ్చారు. దీనివల్ల పొగాకుకు డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతాయని, కొనుగోళ్లు తగ్గి, తమ జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక జిల్లాల్లో ఇప్పటికే పొగాకు రైతులు నిరసనలు చేపడుతూ, పన్నుల తగ్గింపు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారని తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వైయస్ జగన్ కు వినతిపత్రం అందజేశారు. పొగాకు రైతులు ఎదుర్కొనే ఆర్ధిక సంక్షోభాన్ని, దుస్ధితిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం దృష్టికి తీసుకెళుతుందని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తుతారని జగన్ స్పష్టం చేశారు.