అమెరికాలో కలకలం.. రోడ్డుపై కూలిన బిజినెస్ జెట్..!

నడిరోడ్డుపై ఒక బిజినెస్ జెట్ విమానం కూలిపోవడం సంచలనం రేపుతోంది. అది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా చెప్పుకునే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నివాసం సమీపంలోనే కావడం గమనార్హం. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ లో ఉన్న ట్రంప్ నివాసం దగ్గరలోని రోడ్డుపై ఆకాశం నుండి మిస్సైల్ లాగా దూసుకువచ్చిన బిజినెస్ జెట్ కూలిపోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దుర్ఘటనలో ఆ విమానంలో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు మీద పెద్ద గొయ్యి ఏర్పడింది. అమెరికా సమయం ప్రకారం ఆదివారం టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ ప్రాంతం నుండి బహమాస్ కు పయనమైంది. ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ బీచ్ కౌంటీలో రోడ్డుపై ఇది కూలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిసార్ట్ 'మార్-ఎ-లాగో'కు 14 కి.మీ. దూరంలోనే ఈ ఘటన జరగడం చర్చనీయంశమైంది. జనావాస ప్రాంతాలు, వాహనాలకు దూరంగా పడటంతో భారీ ప్రాణనష్టం తప్పింది. కానీ, రోడ్డు మాత్రం ధ్వంసమైంది. కూలిపోవడానికి ముందు విమాన సిబ్బంది నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఒక మెసేజ్ వచ్చింది. జెట్ అదుపు తప్పి వేగంగా కిందకు పడిపోతున్నట్లు వారు భయాందోళనకు గురయ్యారని కథనాలు వస్తున్నాయి. ఈ విమాన ప్రమాదం విమానయాన భద్రతపై మరోసారి చర్చకు తెరలేపింది. సాధారణంగా బిజినెస్ జెట్లు తక్కువ మంది ప్రయాణికులతో వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఉపయోగిస్తుంటారు. అలాంటి విమానం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోవడం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ మార్గంలో ఇతర వాహనాలు ఎక్కువగా లేకపోవడంతో మరింత పెద్ద ముప్పు వాటిల్లలేదు. లేదంటే రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు కూడా ఈ ప్రమాదానికి గురయ్యేవారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. విమానం ప్రయాణించిన చివరి నిమిషాల్లో ఏం జరిగింది? విమానంలోని సాంకేతిక వ్యవస్థలలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలు విచారణలో కీలకం కానున్నాయి. ప్రమాదానికి సంబంధించిన అధికారిక నివేదిక వెలువడిన తర్వాతే అసలు కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



