తలపొగరు చూపిస్తే..ప్యాంట్ తడిపించేశాడు.. ఇది ఒక పవర్ ఫుల్ ఐపీఎస్ స్టోరీ ..!

అది 1971 డిసెంబర్ .. కేరళలోని తలస్సేరి ప్రాంతం భయంకరమైన మత ఘర్షణలతో ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఎప్పుడు ఎవరు ఎవరిని చంపుతారో తెలియని భయంకరమైన పరిస్థితి. ఇళ్లకు నిప్పులు పెడుతున్నారు, దొరికిన వారిని దొరికినట్లు నరుకుతున్నారు. సమీప ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వీధుల్లోకి రాలేక, ఇళ్ళకు తాళాలు వేసుకుని సుదూర బంధువుల ఇళ్ళకు వెళ్ళిపోయారు. జనావాసాలు అన్నీ నిర్మానుష్యంగా స్మశానాన్ని తలపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఆ ప్రాంతంలో విజయన్ కొరాన్ అనే పేరుగల ఓ 26 ఏళ్ళ వయస్సున్న ఒక కరడుగట్టిన గూండా చెలరేగిపోతున్నాడు. రెండు జీపుల్లో ఫుల్లుగా తాగి, మదం పట్టిన ఏనుగుల్లా ఉన్న తన ముఠాను ఎక్కించుకుని ఆ ప్రాంతం అంతా తిరుగుతూ మైకులతో ప్రజలను మరింతగా రెచ్చగొడుతున్నాడు. ఈ క్రమంలో ఈ గ్యాంగ్ చేతిలో జనవరి 4, 1972న కుంజిరామన్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు.
ఈ హత్య జరగడానికి రెండు రోజుల ముందే.. ఆ తలస్సేరి ప్రాంతానికి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఒక 26 ఏళ్ళ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఛార్జ్ తీసుకున్నారు. ఆయనే మన అజిత్ దోవల్. హత్య విషయం తెలియగానే ఆ ఆఫీసర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని హంతకుల వేట మొదలుపెట్టారు. ఆ గూండాల ఆచూకీ తెలుసుకుని తన పోలీసు బ్రృందంతో వెళ్లి వాళ్లు ఉన్న ఫార్మ్‌హౌస్ పై మెరుపుదాడి చేశారు. కానీ ఇక్కడే ఒక ఊహించని సంఘటన జరిగింది. ఆ ముఠా నాయకుడైన విజయన్ కొరాన్ ఒక పోలీసు కానిస్టేబుల్ చేతికి చిక్కాడు. కానీ ఆ రౌడీ, కానిస్టేబుల్ ను బెదిరించడంతో అతను భయపడి వదిలివేశాడు. అది చూసిన అజిత్ దోవల్ కు చిర్రెత్తుకొచ్చింది. తానే స్వయంగా రంగంలోకి దిగారు. కానిస్టేబుల్ ను బెదిరించి పారిపోతున్న ఆ గూండా వెనకాలే యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ దోవల్ స్వయంగా పరుగెత్తారు. అలా అతని వెంట పరిగెత్తుతూ దగ్గరకు పోగానే చేతులతో పట్టుకోకుండా, వెనక నుంచి గాల్లోకి ఎగిరి కాలితో బలంగా ఒక్క తన్ను తన్నారు. ఆ దెబ్బకు విజయన్ కొరాన్ వేగంగా బోర్లా పడిపోయి ముఖం అంతా రోడ్డుకు గీసుకుపోయింది. ముఖం, చేతులు రక్తసిక్తమైనాయి. అతని లుంగీ పూర్తిగా ఊడిపోయింది. ఆ దెబ్బతో గూండాకు చుక్కలు కనిపించాయి. ఆ రౌడీని జీపులో ఎక్కించుకుని తలస్సేరి ప్రజలందరూ చూస్తుండగానే పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చాడు.
ఈ క్రమంలో ఈ యంగ్ ఆఫీసర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతా చేతల్లోనే చూపించారు. పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చిన తరువాత ఆ గూండాను లాకప్ సెల్లో వేశారు.
అప్పటివరకు గూండాకు భయపడిన ఒక కానిస్టేబుల్ సెల్‌లోకి వెళ్ళి, వాడికి సంకెళ్ళు విప్పి నువ్వు రేపటి సూర్యోదయాన్ని చూస్తావని నాకైతే నమ్మకం లేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే గూండా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇంతలోనే ఆఫీసర్ దోవల్ సెల్‌లోకి ఎంటర్ అయ్యారు. మాటల్లేవు.. ఒక చేత్తో ఆ గూండా మెడ పట్టుకుని గోడకు ఆనించి గాల్లోకి పైకి లేపాడు. ఆ గూండా కాళ్ళు నేలకు 1 అడుగు పైకి లేచి మొత్తం శరీరం గాల్లో వేలాడింది. అలా ఒక నిమిషం కాగానే ఆ రౌడీ కళ్ళు తేలడం ప్రారంభించాయి. ఊపిరి ఆడక గిలగిలలాడుతున్న సమయంలో అతడిని క్రిందకు దించారు.
దోవల్ తన విశ్వరూపం చూపించారు. ఆయన నోటి నుంచి వచ్చిన ఆ ఒక్క వార్నింగ్ కు ఆ గూండా ప్యాంట్ తడిపేశాడు. ఆ రౌడీకి మలయాళం తప్ప మరేమీ రాదు. ఆఫీసర్‌కు మళయాళం రాదు. ఇద్దరి మధ్య భాష లేదు.. కేవలం రివాల్వర్ భాష మాత్రమే ఉంది. ఆ స్టేషన్ సిబ్బంది అంతా ఆఫీసర్ వైపు దీనంగా చూశారు. మీరు ట్రాన్స్ఫర్ అయిపోయిన తరువాత ఈ గూండాలు మా కుటుంబాలను చంపేస్తారు సార్ అన్న ఆ పోలీసుల దీనపు చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన దోవల్.. రివాల్వార్ కిందకు దించి..ఈ తలస్సేరి ప్రాంతంలో ఎక్కడా గొడవలూ, హింస కనపడకూడదు వినపడకూడదు.. అలా జరిగితే ఈ పిస్టోల్‌లో ఉన్న గుండు నేరుగా నీ తలలోని మెదడులోకి వెళుతుంది. Is that Clear..?? అని వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. ఆ దెబ్బతో తలస్సేరిలో ఆరు మాసాల పాటు ఎటువంటి గొడవలూ జరగలేదు. ఒక ఏరియాలో అల్లర్లను శాంతియుతంగా కాదు, ఎవరైతే అల్లర్లు సృష్టిస్తున్నారో వారి మెదడులో భయాన్ని నాటడం ద్వారా అణిచివేయొచ్చు అని దోవల్ 26 ఏళ్ల వయసులోనే నిరూపించారు. ఆ ఆపరేషన్ చూసిన అప్పటి కేరళ ముఖ్యమంత్రి అచ్యుతమీనన్, ఆయనను స్వయంగా మెచ్చుకుని, మరొక డిస్టర్బ్డ్ ఏరియాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఆ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఢిల్లీ వెళ్లి, ఐబీలో చేరి పాకిస్థాన్ కు సింహస్వప్నంగా మారారు.ఇది మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ కెరీర్ ప్రారంభంలో జరిగిన రియల్ లైఫ్ మాస్ ఇన్సిడెంట్.



