ఆయిల్ పామ్ రైతులకు సూపర్ న్యూస్..ఏపీకి మరో భారీ భారీ పెట్టుబడి తెచ్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. దేశంలోనే ప్రముఖ ఆయిల్ పామ్ సాగు, ప్రాసెసింగ్ సంస్థ అయిన త్రీ ఎఫ్ ఆయిల్ పామ్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. చెప్పాం.. చేసి చూపించాం అంటూ పెట్టుబడుల కల్పనే లక్ష్యంగా దూసుకుపోతున్న మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ అద్భుతమైన గుడ్ న్యూస్ ను ప్రజలతో పంచుకున్నారు.
ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచడంలో ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది రికార్డు సృష్టించింది. ఒక్క ఏడాదిలోనే 30వేల హెక్టార్ల మార్కును రాష్ట్రం దాటేసింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆయిల్‌పామ్ కొత్త తోటల విస్తరణలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఈ దశాబ్దంలోనే అత్యధికం. ఇంత మొత్తంలో ఉద్యాన తోటల విస్తరణ జరగడం దేశంలోనే ప్రప్రథమమని ఉద్యాన శాఖ తెలిపింది. రాష్ట్రంలో గతేడాదికే 2 లక్షల 48వేల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగులో ఉండగా, 2025-26లో రాష్ట్రంలో 30,012 హెక్టార్ల కొత్త విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ తోటలు విస్తరించడం విశేషం. దీంతో మొత్తంగా సాగు విస్తీర్ణం 2 లక్షల 78వేల హెక్టార్లకు చేరగా, 2026-27 రాష్ట్ర బడ్జెట్లో204కోట్ల కేటాయింపుతో మరో 35వేల హెక్టార్లలో కొత్త తోటల విస్తరణకు ఉద్యాన శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఆయిల్‌పామ్‌కు ఉన్న అంతర్జాతీయ డిమాండ్ దృష్ట్యా కూటమి ప్రభుత్వం వచ్చాక..ఆయిల్‌పామ్ రైతుల్ని ప్రోత్సహించి, కొత్త తోటల విస్తరణకు కృషి చేస్తోంది. దీంతో వరుసగా 2024-25, 2025-26లలో కూడా ఆయిల్‌పామ్ తోటల విస్తీర్ణం పెంచడంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. సాగు విధానాల్లో కూడా త్రిభుజ పద్ధతికి బదులు చదరపు పద్ధతిని ప్రోత్సహిస్తోంది. దీనివల్ల రైతులు పసుపు, అల్లం, మొక్కజొన్న, కూరగాయల వంటి వార్షిక పంటలతోపాటు, అరటి, కోకో, వక్క, జాజి, మిరియాలు వంటి శాశ్వత పంటలను ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలుగా రైతులు సాగు చేస్తున్నారు. దీని వల్ల భూ వినియోగ సామర్ధ్యం పెరగడంతోపాటు రైతుల ఆదాయం మెరుగవుతోంది. పామాయిల్ రైతులకు మెట్రిక్ టన్నుకు సగటున 19,579 ధర లభిస్తోంది.



