తెలంగాణలో యాసంగిలో కంది పంట…అత్యధిక దిగుబడినిచ్చే 6 కంది రకాలు ఇవే!

ఎల్-నినో ప్రభావం వల్ల ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కాబట్టి రాబోయే యాసంగిలో వరికి విరామం ప్రకటించాలని ప్రభుత్వం ప్రకటించింది. బోర్లలో నీరు అడుగంటిపోవడం, కాలువల కింద కూడా యాసంగిలో కేవలం 3 నుంచి 4 తేలికపాటి తడులు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉండటంతో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని తెలిపింది. మరి తక్కువ నీటితో స్థిరమైన దిగుబడి, చేతినిండా ఆదాయం ఇచ్చే పంట ఏమైనా ఉందా? అంటే అది కచ్చితంగా కంది పంట అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
అసలు యాసంగిలో కంది వేయడం వల్ల కేవలం డబ్బులు మాత్రమే కాదు, భూమికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. కందికి సహజంగానే ఆకురాల్చే గుణం ఉంటుంది. పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకులు నేలలో రాలిపోయి, కుళ్లిపోయి సేంద్రియ పదార్ధంగా మారుతాయి. దీనివల్ల నేల భౌతిక, రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా కంది వేర్లలో రైజోబియం అనే మేలు చేసే బ్యాక్టీరియా ఉండి.. గాలిలోని నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తుంది. ఇది భూమిని గుల్లబార్చి, నీటిని నిల్వ ఉంచుకునే సామర్ధ్యాన్ని పెంచుతుంది. అంటే మీ తర్వాతి పంటకు ఫ్రీగా ఎరువు దొరికినట్లే. కంది సాగుకు ఎర్ర చల్క , నల్లరేగడి నేలలు చాలా అనుకూలం. కానీ నీరు నిలిచిపోయే చౌడు నేలల్లో మాత్రం కంది అస్సలు పండదు.
యాసంగిలో నాటుకోవడానికి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించిన 6 అద్భుతమైన కంది రకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ కంది-2... ఇది 120 నుంచి 130 రోజుల పంట. ఎకరాకు 7 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఫ్యుజేరియమ్ ఎండు తెగులును తట్టుకుంటుంది. రుద్రేశ్వర WRG-65 రకం.. ఇది కూడా 120 నుంచి 130 రోజుల పంట. ఎకరాకి 7-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. శనగపచ్చ పురుగును కొంతవరకు తట్టుకుని, నల్లరేగడి భూములకు బాగా సెట్ అవుతుంది. హనుమ TDRG-4 రకం..ఇది ఎకరాకి 7-8 క్వింటాళ్ల దిగుబడినిచ్చే ఈ రకం.. ఎండు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. మన్నెకొండ కంది ICP H-2740 రకం.. 120-140 రోజుల ఈ పంట ఎకరాకి ఏకంగా 8-9 క్వింటాళ్ల అత్యధిక దిగుబడి ఇస్తుంది. వెర్రి తెగులు, ఎండు తెగులు దరిచేరవు. తెలంగాణ కంది–3 TDRG-272 రకం : ఇది కూడా ఎకరాకి 8-9 క్వింటాళ్ల భారీ దిగుబడినిచ్చే రకం. తెలంగాణ కంది-2 WRG 121 రకం.. 130-135 రోజుల్లో వచ్చే ఈ రకం ఎకరాకి 7-8 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. మారుక మచ్చల పురుగు, కాయతొలిచే ఈగను తట్టుకుంటుంది.



