200 రకాల కీటకాలకు…ఈ ఒక్కటి వాడితే చాలు..తక్కువ ఖర్చు, ఎక్కువ లాభాలు!

పూర్వం మన భారతదేశ వ్యవసాయం పూర్తిగా ప్రకృతితో మమేకమై సాగేది. ఎరువులైనా, పురుగుమందులైనా అన్నీ మన పెరట్లో దొరికే ఆకులు, ఆవు పేడతోనే తయారయ్యేవి. కానీ హరిత విప్లవం తర్వాత దిగుబడుల వెంట పరిగెడుతూ , సింథటిక్ , రసాయన పురుగుమందుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ కెమికల్స్ వల్ల పంటలపై దాడి చేసే పురుగులే కాదు.. మన నేల, పర్యావరణం, చివరికి ఆ తిండి తింటున్న మన ఆరోగ్యం కూడా నాశనం అవుతోంది. ఈ విషపూరిత దుష్ప్రభావాల గురించి ఇప్పుడు రైతుల్లో అవగాహన పెరగడంతో మళ్లీ..కీటకా నివారణకు ప్రకృతి విధానాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి ప్రకృతి సేద్యంలో కీటకాల నియంత్రణకు మన కళ్లెదురుగా ఉన్న ఒకే ఒక్క సంజీవని, అద్భుతమైన వరం వేప.
భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న చెట్టు వేప. వేప వృక్షం లోని అన్ని భాగాలు ఉపయోగపడేవే. వేపని ఆయుర్వేద మందుల్లో , కొన్ని సౌందర్య ఉత్పత్తుల తయారీలోనే మాత్రమే కాక, క్రిమి సంహరక గుణం ఉన్నందున వివిధ పంటలనాశించే చీడపీడల నియంత్రణకి వాడతారు. పంటలనాశించే చీడపీడలని నియంత్రించడానికి సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించితే చీడపీడల ఉధృతి తక్కువగా ఉండి , రసాయనిక పురుగు,తెగుళ్ల మందుల వాడకం తగ్గుతుంది. వృక్ష సంబంధ మందులలో వేప ప్రధానమైనది. ఇతర రసాయన మందులతో పోలిస్తే , వేప మందుల వల్ల పర్యావరణానికి , క్షీరదాలకు, తేనెటీగలకి, మిత్రపురుగులకి హాని కలగదు. వేపచెట్టు అన్ని భాగాలు క్రిమిసంహారక స్వభావం కలిగిఉండి దాదాపు 200 రకాల పురుగులను అదుపులో ఉంచగలదు.
రసాయన పురుగుమందులు కొడితే పురుగు వెంటనే చనిపోతుంది, కానీ ఆ మందు తాలూకు విషం మొక్క ఆకుల్లో, కాయల్లో నెలల తరబడి ఉండిపోతుంది. కానీ వేప ఆధారిత పురుగుమందుల అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఇవి మొక్కలపై ఎటువంటి విషపూరిత అవశేషాలను వదిలివేయవు. వేపపై నిర్వహించిన ఎన్నో పరిశోధనల ప్రకారం, వేపలో ప్రధానంగా అజార్డిరక్టిన్ అనే ఒక అద్భుతమైన బయో-కెమికల్ కాంపౌండ్ అత్యధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనితో పాటు సాలనిన్ , మెలాండ్రియోల్ అనే సహజ రసాయనాలు కూడా వేపలో ఉంటాయి. ఈ రసాయనాలు అన్నీ కలిసి కీటకాల పాలిట ఒక పవర్ ఫుల్ వికర్షకంగా , యాంటీ-ఫీడెంట్ గా పనిచేస్తాయి. వ్యవసాయంలో వేప నూనెను 10 నుంచి 100 పిపిఎమ్ సాంద్రత వద్ద వాడినప్పుడు.. సుమారు 200 రకాల కీటకాలను, తెగుళ్లను ఇది విజయవంతంగా నాశనం చేస్తుందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన రీసెర్చ్ లో తేలింది.
ఇక్కడ రైతులకు అత్యంత ప్రయోజనం చేకూర్చే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రైతుల మిత్ర పురుగుల రక్షణ. మనం పొలంలో కెమికల్స్ కొట్టినప్పుడు అది ఆకులను తినే పురుగులతో పాటు, పంటకు మేలు చేసే తేనెటీగలు, వానపాములు, సీతాకోక చిలుకలు, అక్షింతల పురుగులను కూడా దయలేకుండా చంపేస్తుంది. కానీ వేప అలా కాదు. వేప నూనె కేవలం ఆకులను తినే , రసం పీల్చే హానికర కీటకాలను మాత్రమే టార్గెట్ చేస్తుంది. ప్రయోజనకరమైన మిత్ర పురుగులకు ఇది ఎలాంటి హాని కలిగించదు. వేప పర్యావరణ అనుకూలమైనది , మనుషులకు, జంతువులకు విషపూరితం కానిది కావడంతో దీన్ని ఇతర ప్రకృతి ఎరువులతో అంటే జీవామృతం, అగ్ని అస్త్రం లాంటివి కలిపి మరింత ప్రభావవంతంగా అన్ని రకాల పంటలపై ఉపయోగించవచ్చు. ఇలాంటి ఎకో-ఫ్రెండ్లీ లక్షణాల వల్లే ఇప్పుడు వేప బేస్డ్ ప్రోడక్ట్స్ కు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యూరప్ , అమెరికా దేశాలో భారీ డిమాండ్ ఏర్పడింది.
పొలంలోనే కాదు, కోతలు పూర్తయ్యాక గోడౌన్లలో, ఇంట్లో నిల్వ ఉంచిన విత్తనాలకు కూడా వేప అద్భుతమైన రక్షణ ఇస్తుంది. ఆకులపై, విత్తనాలపై పురుగులు గుడ్లు పెట్టకుండ నిరోధించడం వేప మరొక గొప్ప లక్షణం. మార్కెట్ నుండి తీసుకొచ్చిన విత్తనాలు అప్పటికే కొన్ని కీటకాల బారిన పడవచ్చు. అలాంటప్పుడు ఆ నిల్వ చేసిన విత్తనాలపై వేప గింజల కషాయం లేదా వేప నూనెను చల్లినపుడు, కీటకాలు వాటిని ఆహారంగా తీసుకోలేవు. ఆడ పురుగులు వాటిపై ఎట్టి పరిస్థితుల్లోనూ గుడ్లు పెట్టలేవు. తద్వారా విత్తనాలు పురుగుపట్టకుండా, పాడవ్వకుండా కాపాడుకోవచ్చు. ఇలా ఆర్థిక సాధ్యత , పర్యావరణ అనుకూల స్వభావం కారణంగా.. సమగ్ర సస్య రక్షణలో వేప వాడకం ఒక అత్యంత ముఖ్యమైన భాగంగా మారిపోయింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలనుకునే ప్రతి రైతుకు వేపను మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు.



