ఆ పౌరుల డిపోర్ట్ అంశంలో అమెరికాకు భారీ షాకిచ్చిన పాకిస్థాన్..!

అమెరికాలో అక్రమ వలసదారులను డిపోర్ట్ చేయడం డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యంత కీలకాంశం. ఎవరైతే సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్నారో, వారిని వెంటనే పట్టుకుని వారి సొంత దేశాలకు పంపించి వేసేందుకు అమెరికా ప్రభుత్వం చాలా సీరియస్‌గా అడుగులు వేస్తోంది. అయితే అన్ని దేశాల వారిని పంపించినట్లు ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ పౌరులను పంపించడం కుదరదు. ఎందుకంటే, ఇరాన్ తో అమెరికాకు ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు. డైరెక్ట్‌గా అమెరికా విమానాలు ఇరాన్లో ల్యాండ్ కాలేవు. ఇక ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి చూసుకుంటే.. అక్కడ తాలిబన్ల రాజ్యం నడుస్తోంది. దీంతో ఈ రెండు దేశాలకు చెందిన వలసదారులను స్వదేశాలకు పంపించడానికి ట్రంప్ ప్రభుత్వం ఒక కొత్త మాస్టర్ ప్లాన్ వేసింది. వారిని పంపేదుకు పాకిస్థాన్‌ను ఒక మధ్యంతర రవాణా కేంద్రంగా వాడుకోవడం. అమెరికా నుంచి విమానాలను పాకిస్థాన్‌కు పంపి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ఇరాన్, ఆఫ్ఘన్లకు వలసదారులను పంపాలన్నది అమెరికా వ్యూహం. కానీ, ట్రంప్ వేసిన ఈ వ్యూహానికి పాకిస్థాన్ అనూహ్యంగా బ్రేక్ వేసింది. అమెరికాకు ఒక భారీ షాక్ ఇచ్చింది.
ఈ నవంబర్ 10న అమెరికాలోని అరిజోనా రాష్ట్రం, మెసా ఎయిర్పోర్ట్ నుంచి ఒక భారీ డిపోర్టేషన్ విమానం బయలుదేరింది. అందులో తొమ్మిది మంది ఇరాన్ పౌరులు ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. వీరిని పాకిస్థాన్‌లో దించి, అక్కడి నుంచి ఇరాన్ పంపాలన్నది ప్లాన్. అయితే ఆ విమానం గాల్లోకి ఎగిరిన సరిగ్గా 30 నిమిషాల్లోనే యూ-టర్న్ తీసుకుని తిరిగి అదే అరిజోనా విమానాశ్రయానికి చేరుకుంది. ఆ ప్రయాణికులను తమ దేశంలోకి స్వీకరించేందుకు పాకిస్థాన్ నిరాకరించడమే ఇందుకు కారణం. పాకిస్థాన్ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో అమెరికా అధికారులు విమానాన్ని వెనక్కి రప్పించారు. ఇది ఒక్కరోజు జరిగిన సంఘటన కాదు. కేవలం మూడు రోజుల వ్యవధిలో అమెరికాకు ఎదురైన రెండో విఫల ప్రయత్నం ఇది. అంతకుముందు నవంబర్ 8న కూడా ఇలాగే ఎనిమిది మంది ఇరానీయులను పాకిస్థాన్ మీదుగా పంపించే ప్రయత్నం చేశారు, కానీ అది కూడా చివరి నిమిషంలో క్యాన్సెల్ అయ్యింది.


