హార్ముజ్ జలసంధిలో మళ్లీ హై టెన్షన్..అమెరికా రాడార్‌ను పేల్చేసినట్లు ఐ.ఆర్.జీ.సీ ప్రకటన

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా అంటూ మొదలైన వివాదం ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య డైరెక్ట్ వార్‌కు దారి తీసేలా కనిపిస్తోంది. బహ్రెయిన్ ద్వీపంలో ఉన్న అమెరికా ముందస్తు హెచ్చరికల రాడార్ వ్యవస్థను తాము ధ్వంసం చేశామని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారికంగా ప్రకటించింది. ఇది అమెరికాకు కేవలం ఒక చిన్న హెచ్చరిక మాత్రమేనని, తమ సరిహద్దులను ఉల్లంఘిస్తే గతంలో కంటే మరింత కఠినంగా బదులిస్తామని IRGC వార్నింగ్ ఇచ్చింది. అగ్రరాజ్యం అమెరికా చర్యలకు ఇరాన్ గంటల వ్యవధిలోనే రిటార్ట్ ఇచ్చింది. ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. మొదట ఇరాన్‌లోని సిరిక్ ప్రాంతంలో ఉన్న ఒక కీలకమైన టెలికమ్యూనికేషన్ టవర్‌పై అమెరికా వైమానిక దాడి చేసింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తూ అమెరికా చేసిన ఈ దాడిని IRGC తీవ్రంగా పరిగణించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఏరోస్పేస్ దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. అమెరికా దాడి జరిగిన సుమారు గంటలోపే ఇరాన్ దళాలు రివర్స్ అటాక్ చేశాయి. బహ్రెయిన్ ద్వీపంలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన అమెరికా సైన్యానికి చెందిన ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దళాలు దాడి చేశాయి. ఈ పవర్ ఫుల్ దాడిలో అమెరికా రాడార్ పూర్తిగా ధ్వంసమైనట్లు IRGC తన ప్రకటనలో స్పష్టం చేసింది. భవిష్యత్తులో అమెరికా వైమానిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, తమపై దాడులకు పాల్పడితే ఇలాంటి తీవ్ర పరిణామాలే ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించడమే ఈ ఆపరేషన్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఇరాన్ చెబుతోంది.
ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా అక్రమాలకు పాల్పడుతోందని ఇరాన్ ఆరోపించింది. అక్కడ అమెరికా బలగాలు చమురు అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేసింది. తమ దేశ సరిహద్దులను మరోసారి ఉల్లంఘించి, ఇలాగే దూకుడు చర్యలకు పాల్పడితే అత్యంత తీవ్రంగా స్పందిస్తామని IRGC అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేసింది. ఒకవేళ అమెరికా మరోసారి తమ ఏరోస్పేస్ దళాలను రెచ్చగొడితే, ఎలాంటి పరిమితులు లేకుండా ప్రతిస్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని IRGC స్పష్టం చేసింది. అయితే ఇరాన్ కేవలం అమెరికాను మాత్రమే కాదు, అమెరికాకు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న ఇతర దేశాలను కూడా గట్టిగా హెచ్చరించింది. అమెరికా చేపట్టే సైనిక చర్యలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించే ఏ దేశమైనా సరే, తమపై దాడిలో వారిని కూడా భాగస్వాములుగా పరిగణిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలను ప్రస్తావిస్తూ ఆయన సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ లో ఒక ఘాటైన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇరాన్ చేస్తున్న ఈ తాజా ప్రకటనలతో పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణక్షణానికీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ముఖ్యంగా బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, అలాగే హార్ముజ్ జలసంధి ప్రాంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయంశంగా మారింది. ఇన్నాళ్లూ ప్రాక్సీ యుద్ధాలు చేసిన ఇరాన్ ఇప్పుడు డైరెక్ట్‌గా అమెరికా బేస్‌లను టార్గెట్ చేయడం పశ్చిమాసియాలో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయో, గ్లోబల్ ఎకానమీపై ఈ వార్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోందో అని ప్రపంచ దేశాలు ఆందోళనగా గమనిస్తున్నాయి.


