వేల సంఖ్యలో మనుషుల విగ్రహాలు…వీరప్పన్ తిరిగిన అడవుల్లో అంతుచిక్కని మిస్టరీ గుడి

ఒక దట్టమైన అడవి మధ్యలో, ఎటు చూసినా నిలబడి ఉన్న ఆ మనుషుల విగ్రహాలు చూస్తే ఎవరికైనా భయకంపితులవుతారు. ఇది ఎక్కడో హాలీవుడ్ లో సెట్టింగ్ కాదు.. మన పక్క రాష్ట్రమైన తమిళనాడులోని ధర్మపురి అడవుల్లో ఉన్న ఒక మిస్టరీ టెంపుల్ దగ్గర కనిపించే దృష్యాలు. ఒకప్పుడు ఆ అడవి పేరు చెబితేనే పోలీసులైనా, సామాన్యులైనా వణికిపోయేవాళ్లు. ఎందుకంటే అది గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఏలిన సామ్రాజ్యం. సరిగ్గా అదే అడవిలో ఉంది శ్రీ కుండంపట్టి మునియప్పన్ కోవిల్ . ఈ గుడికి ఒక వింత ఆచారం ఉంది. భక్తుల కోరిక తీరితే, దేవుడికి కానుకగా డబ్బులో, నగలో ఇవ్వరు.. ఏకంగా ఒక మనిషి విగ్రహాన్ని తయారు చేసి అక్కడ పెడతారు. అలా భక్తులు పెట్టిన విగ్రహాలు ఇప్పుడు అక్కడ వేల సంఖ్యలో ఉన్నాయి. ధర్మపురి జిల్లాలోని ఈ గుడి మిగతా అన్ని ఆలయాల కంటే ఎంతో భిన్నమైనది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ భక్తులు అనుసరించే విగ్రహాల సమర్పణ ఆచారం. ఈ గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే వందలు, వేల సంఖ్యలో చేతితో తయారు చేసిన మనుషుల విగ్రహాలు, కాపలాదారుల విగ్రహాలు దర్శనమిస్తాయి. చూసేందుకు ఇవి కాస్త భయపెట్టేలా ఉన్నప్పటికీ, వీటి వెనుక భక్తుల అపారమైన విశ్వాసం దాగి ఉంది. ఈ ప్రాంత ప్రజలు తమ కోరికలు నెరవేరాలని కుండంపట్టి మునియప్పన్ స్వామికి మొక్కుకుంటారు. తమ కోరిక నెరవేరిన వెంటనే, మొక్కుబడి తీర్చుకోవడానికి భక్తులు స్వయంగా ఒక విగ్రహాన్ని తయారు చేయించి, ఈ గుడి ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తారు. దేవుడికి సేవకుడిగా లేదా కాపలాదారుడిగా తమ విగ్రహం ఉంటుందని వారి నమ్మకం. ఇలా దశాబ్దాల కాలంగా భక్తులు సమర్పించిన విగ్రహాలతో ఆ అటవీ ప్రాంతం అంతా ఒక పెద్ద విగ్రహాల సామ్రాజ్యంగా మారిపోయింది. ఈ వింత గుడి పుట్టుక వెనుక ఒక పెద్ద చారిత్రక విషాదం కూడా ఉంది. మునియప్పన్ స్వామి మొదటి నుంచి ఈ అడవిలో లేడు. ఒకప్పుడు స్థానికుల చరిత్రను పరిశీలిస్తే.. ఈ దేవుడి మూలాలు కుండంపట్టి అనే చారిత్రక గ్రామంలో ఉండేవి. ఆ గ్రామ ప్రజలు మునియప్పన్ స్వామిని తమ గ్రామ దేవతగా, కాపలా దేవుడిగా పూజించేవారు. కానీ వారి ప్రశాంత జీవితంలోకి ఒక అతిపెద్ద మార్పు వచ్చింది. తమిళనాడులోని ప్రతిష్టాత్మక మేట్టూర్ డ్యామ్ నిర్మాణం జరిగిన సమయంలో, కావేరి నది జలాలతో ఆ కుండంపట్టి గ్రామం పూర్తిగా నీటమునిగిపోయింది. డ్యామ్ బ్యాక్ వాటర్స్ వల్ల తమ ఇళ్లను, భూములను కోల్పోయిన ఆ గ్రామ ప్రజలు.. కట్టుబట్టలతో వేరే ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. అయితే వారు ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్లేటప్పుడు, తమను దశాబ్దాలుగా కాపాడుతున్న తమ ఇలవేల్పు మునియప్పన్ స్వామిని అక్కడే వదిలేయలేకపోయారు. ఆ దేవుడి విగ్రహాన్ని కూడా తమతో పాటే మోసుకువచ్చి, నెరుప్పూర్ సమీపంలోని ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. అప్పటినుంచి మునియప్పన్ స్వామి ఈ అడవిలోనే కొలువై ఉన్నాడు.



