తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..అన్నదాతకు అండగా ‘భారత్ విస్తార్’ తో ఒప్పందం

తెలంగాణ వ్యవసాయ రంగాన్ని టెక్నాలజీ వైపు నడిపించే ఒక బృహత్తర కార్యక్రమానికి సచివాలయం వేదికగా అడుగుపడింది. రైతులకు ఇకపై సాగుకు సంబంధించిన సమాచారం, సలహాలు తెలుగులోనే అందుబాటులోకి రానున్నాయి. ఏఐ ఆధారిత జాతీయ వేదిక భారత్ విస్తార్ ను రాష్ట్రంలో అమలు చేయడానికి వ్యవసాయ శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. భారత్ విస్తార్ అనేది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రూపొందించిన జాతీయ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందులో ఐసీఏఆర్, ఐఎండీ, అగ్రిమార్కెట్, సాయిల్ హెల్త్ కార్డులు, కేంద్ర పథకాలు వంటి అనేక వ్యవస్థల సమాచారం ఒకే చోట ఉంటుంది. తెలంగాణలోని ప్రాంతీయ వాతావరణం, నేలల స్వభావం, పంటల వైవిధ్యం, స్థానిక సాగు పద్ధతులకు అనుగుణంగా ఈ డేటాను క్రోడీకరించి మన రైతులకు సులభంగా అర్థమయ్యేలా అందించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం.
రైతు తన సమస్యను ఫోన్లో మైక్ ఆన్ చేసి అచ్చమైన తెలుగులో అడిగితే చాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆ ఏఐ కూడా తెలుగులోనే సమాధానాలు, సలహాలు ఇస్తుంది. ఈ వేదిక ద్వారా రైతులకు ఆరు ప్రధాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఊరి వాతావరణానికి ఏ పంట సాగు చేయాలి? ఎప్పుడు విత్తుకోవాలి? నేలలో పోషకాల స్థితి ఎలా ఉంది? నీటి యాజమాన్యం ఎలా చేసుకోవాలి? అనే శాస్త్రీయ సలహాలు లభిస్తాయి. వీటన్నింటికంటే ముఖ్యమైన ఫీచర్ ఒకటుంది. మీ పొలంలో పంటకు ఏదైనా తెగులు వస్తే, ఆ ఆకును లేదా మొక్కను ఫొటో తీసి ఈ యాప్‌లో పంపితే చాలు.. అందులో ఉన్న కృత్రిమ మేధ ఆ ఫొటోను స్కాన్ చేసి, అది ఏ తెగులో గుర్తించి, దానికి ఏ మందు కొట్టాలో కచ్చితమైన నివారణ చర్యలను టెక్స్ట్ లేదా వాయిస్ రూపంలో రైతుకు చెబుతుంది. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి రావడం నిజంగా వ్యవసాయంలో ఒక విప్లవమే. మరి ఈ సేవలను పొందడం కోసం ప్రభుత్వం నాలుగు సులువైన మార్గాలను డిజైన్ చేసింది. ముందుగా ప్రస్తుతం వ్యవసాయ శాఖ నడుపుతున్న 155261 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే, అక్కడ తెలుగు వాయిస్ బాట్ ఏఐ మీతో మాట్లాడుతుంది. ఒప్పందం జరిగిన 15 నుంచి 21 రోజుల్లో దీనికోసం ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్, అలాగే ఒక డెడికేటెడ్ తెలుగు మొబైల్ యాప్ కూడా ప్రారంభం కానున్నాయి. స్మార్ట్‌ఫోన్ వాడే రైతులు ఇంకా సులభంగా యాక్సెస్ చేసుకునేలా, 45 నుంచి 60 రోజుల్లో వాట్సాప్ చాట్‌బాట్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. స్మార్ట్‌ఫోన్ లేని రైతుల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయనుంది. సాధారణ బటన్స్ ఫోన్ ఉన్న రైతులు ఆ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వారికి వాయిస్ కాల్లో సలహాలు అందుతాయి. ఈ ఒప్పందంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారు. ఆధునిక సాంకేతికతను రైతులకు దగ్గర చేయడం ద్వారా సాగు ఖర్చును తగ్గించి, దిగుబడులు, ఆదాయం పెంచాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన వివరించారు. రైతులు తమ పంట ఉత్పత్తులకు అగ్రిమార్కెట్ ద్వారా ఎక్కడ మంచి ధర ఉందో తెలుసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంటుందన్నారు. కేవలం సలహాలు మాత్రమే కాదు.. రైతులు పెట్టుకున్న దరఖాస్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి, రైతుబంధు లాంటి చెల్లింపులు, అలాగే ఫిర్యాదుల స్థితి లాంటి వాటన్నింటినీ కూడా ఈ స్టేట్ సిస్టమ్‌తో అనుసంధానం చేస్తామని చెప్పారు.



