ఇరాన్ పై అణు దాడికి అమెరికా రెడీ..భారత్ పై ప్రభావం..?

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ఏకంగా అణుదాడి స్థాయికి చేరుకోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇరాన్ లోని అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగుతుందనే వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ అణు కార్యక్రమం ఎప్పుడూ పాశ్చాత్య దేశాలకు ఒక మిస్టరీగానే ఉంటూ వస్తోంది. ఇరాన్ లోని అత్యంత కీలకమైన నటాంజ్ అణు సంక్లిష్ట కేంద్రానికి అత్యంత సమీపంలోనే పిక్‌యాక్స్ పర్వతం ఉంది. అంతర్జాతీయ నిపుణుల అంచనా ప్రకారం, ఈ పర్వతం లోపల భూమికి సుమారు 100 మీటర్ల అంటే 300 అడుగుల లోతులో ఇరాన్ ఒక భారీ సొరంగాల సముదాయాన్ని నిర్మించింది. సాధారణ బాంబులు, క్షిపణులు ఈ పర్వతాన్ని ఏమాత్రం చీల్చుకుని లోపలికి వెళ్లలేవు. ఇరాన్ తన అత్యంత రహస్య అణు శుద్ధి కార్యక్రమాలను, యురేనియం ఎన్రిచ్ మెంట్ ను ఈ పర్వత లోతుల్లోనే అత్యంత భద్రంగా కొనసాగిస్తోందని అమెరికా, ఇజ్రాయెల్ గట్టిగా నమ్ముతున్నాయి. ఈ బంకర్లను నాశనం చేయాలంటే వ్యూహాత్మక అణుదాడి లేదా బంకర్ బస్టర్ బాంబులు వాడటం తప్ప వేరే దారి లేదు.
గతంలో ట్రంప్ ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవాల్సి రావచ్చు అని పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అవసరమైతే కేవలం గంటలోనే దాడి చేసి ఆ కేంద్రాలను నాశనం చేయగలమని ఆయన తాజాగా పేర్కొనడం ఈ అణుదాడి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. దీనికి తోడు ప్రముఖ అమెరికన్ కన్జర్వేటివ్ వ్యాఖ్యాత టక్కర్ కార్ల్సన్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పెడుతున్న విపరీతమైన ఒత్తిడి కారణంగానే అమెరికా ఇరాన్‌పై అణుదాడికి సిద్ధమవుతోందని ఆయన ఓపెన్ గానే ఆరోపించారు. దీనిపై అమెరికా నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా, తెరవెనుక జరుగుతున్న పరిణామాలు మాత్రం మహా వినాశనానికి సంకేతాలు ఇస్తున్నాయి.
ఒక భూగర్భ అణు పేలుడు సంభవిస్తే అది కేవలం ఆ ఒక్క పర్వతాన్ని మాత్రమే నాశనం చేయదు. అందులోంచి వెలువడే లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత, భయంకరమైన రేడియోధార్మికత పర్వతాన్ని చీల్చుకుని వాతావరణంలోకి ఎగజిమ్ముతాయి. ఇప్పుడు మన భారతదేశాన్ని భయపెడుతున్న అసలు విషయం ఇదే. ఇరాన్ లో పేలుడు జరిగితే ఆ ఎఫెక్ట్ ఇండియాకు ఎలా వస్తుందని చాలామందికి డౌట్ రావచ్చు. అంతర్జాతీయ రక్షణ నిపుణుడు సందీప్ ఉన్నితన్ విశ్లేషణ ప్రకారం.. ఒకవేళ పిక్‌యాక్స్ పర్వతంపై భూగర్భ అణు పేలుడు సంభవిస్తే, దానివల్ల ఉత్పన్నమయ్యే రేడియోధార్మిక పదార్థాలు గాలిలో కలిసిపోతాయి. పశ్చిమం నుంచి తూర్పుకు వీచే గాలుల దిశను బట్టి, ఆ రేడియోధార్మిక మేఘాలు ఇరాన్ నుంచి పాకిస్థాన్ వాయువ్య సరిహద్దు దాటుకుని నేరుగా భారతదేశంలోకి ప్రవేశించే పెను ప్రమాదం ఉంది. ఈ గాలుల ప్రభావంతో భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, గుజరాత్ ప్రాంతాలకు ఈ రేడియోధార్మిక కణాలు స్వల్ప మోతాదులో చేరవచ్చని నిపుణులు స్పష్టంగా అంచనా వేస్తున్నారు. ఇది ఒక భయంకరమైన చైన్ రియాక్షన్.
ఇరాన్ కు, ఇండియాకు మధ్య ఉన్న దూరం పెరిగేకొద్దీ రేడియేషన్ తీవ్రత కొంత తగ్గినప్పటికీ, వాతావరణంలో పొంచి ఉన్న ముప్పును ఏమాత్రం తక్కువ అంచనా వేయలేము. గాలి ద్వారా ప్రయాణించే ఈ రేడియోధార్మిక కణాలు మన వాయవ్య రాష్ట్రాల వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు.. సరిగ్గా ఆ ప్రాంతాల్లో గనక వర్షాలు పడితే జరిగే ఘోరం అంతా ఇంతా కాదు. వర్షపు నీటితో పాటు ఈ రేడియోధార్మిక కణాలు భూమిపై పడి స్థానికంగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల పంట పొలాలు విషతుల్యం అవ్వడం, నీటి వనరులు కలుషితం అవ్వడం, ప్రజలు దీర్ఘకాలిక క్యాన్సర్ బారిన పడటం లాంటి వినాశకరమైన పరిణామాలు తలెత్తుతాయి. ఏదేమైనా ఇరాన్‌పై గనక అణుదాడి జరిగితే.. దాని పర్యవసానాలు కేవలం పర్షియన్ గల్ఫ్‌కే పరిమితం కావు. గ్లోబల్ ఆయిల్ సప్లై దెబ్బతిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోతుంది. పర్యావరణ వ్యవస్థ కోలుకోలేని విధంగా నాశనం అవుతుందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై అణుబాంబు వేసిన తర్వాత.. మళ్లీ ఏ దేశం కూడా ఇంతవరకు అణ్వాయుధాన్ని ప్రయోగించే సాహసం చేయలేదు.



