టాలీవుడ్లో ఫ్లాప్స్.. కోలీవుడ్లో బంపర్ ఆఫర్స్..!

పెళ్లి సందD సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన గ్లామర్, క్యూట్ నెస్ తో మొదటి సినిమాతోనే యూత్ ను ఎట్రాక్ట్ చేసింది తెలుగమ్మాయి శ్రీలీల. ఇక రవితేజ సరసన చేసిన ధమాకా సినిమాతో శ్రీలీల క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఆ సినిమా 100 కోట్ల బ్లాక్బస్టర్ అవ్వడం, అందులో శ్రీలీల వేసిన డాన్స్ స్టెప్పులకు ఇండస్ట్రీ మొత్తం ఫిదా అవ్వడంతో ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరసగా సినిమాలు ఒప్పుకోవడం, చేసిన చాలా చిత్రాల్లో ఒకే తరహా పాత్రలు లేదా కేవలం పాటలకే పరిమితమయ్యే పాత్రలు చేయడంతో ఆడియన్స్ కు శ్రీలీల బోర్ కొట్టించేసింది. బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి లాంటి మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమా మినహాయిస్తే.. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ తో చేసిన సినిమాలన్నీ ఆశించినంత ఫలితాల్ని అందుకోలేకపోయాయి. క్రేజ్ ఉన్నప్పుడే క్యారెక్టర్ లో డెప్త్ లేని రొటీన్ సినిమాలు చేయడంతో శ్రీలీలకు తెలుగులో దాదాపుగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అక్కడ కూడా ఆమెకు స్టార్టింగ్ లోనే షాక్ తగిలింది. ఈ ఏడాది సంక్రాంతి టైంలో వచ్చిన పరాశక్తి సినిమాతో తమిళంలోకి ఎంటర్ అయినా.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ అయింది. అయినా సరే శ్రీలీల అదృష్టం ఏంటంటే, కోలీవుడ్ లో ఇప్పుడు ఏకంగా ముగ్గురు టాప్ స్టార్స్ సరసన ఛాన్సులు కొట్టేసింది. ప్రస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓం సినిమాలో ఒక హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల 20న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇది సెట్స్ పై ఉండగానే.. ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం డేర్ డెవిల్ లో అవకాశం అందుకుంది. వీటన్నింటికీ మించి సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ధర్మన్ చిత్రంలో కూడా శ్రీలీల ఛాన్స్ కొట్టేసి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. తెలుగులో ఆఫర్లు లేవనుకున్న టైమ్ లో ఇలా తమిళ టాప్ స్టార్స్ తో మూడు భారీ ప్రాజెక్టులు సెట్ చేసుకోవడం నిజంగా శ్రీలీల లక్ అనే చెప్పాలి.
వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు, ఈ మూడు స్టార్ హీరోల చిత్రాలు సక్సెస్ అవ్వాల్సిన అవసరం శ్రీలీలకు ఎంతయినా ఉంది. అందులో మొదటిది ధనుష్ ఓం సినిమా రిజల్ట్ మీదే శ్రీలీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అజిత్ డేర్ డెవిల్, రజనీకాంత్ ధర్మన్ సినిమాలు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న చిత్రాలు కాబట్టి.. ఆయా సినిమాల్లో శ్రీలీల పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందన్నది కూడా కీలకమే. కేవలం పాటలకే పరిమితం కాకుండా, యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకుంటేనే తమిళ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ మూడు చిత్రాల్లో ఏమాత్రం బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టినా, ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడిపోయి శ్రీలీల కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోవడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపిన ఈ డ్యాన్సింగ్ సెన్సేషన్.. ఇప్పుడు తన అదృష్టాన్ని కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పరీక్షించుకోబోతోంది. టాలెంట్ ఉన్న హీరోయిన్ కు సరైన డైరెక్టర్ పడితే, మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు.



