ఓటమి దెబ్బ.. రూట్ మార్చిన ట్రంప్..?

తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురైన ఫలితాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు ఒక గట్టి గుణపాఠమే నేర్పాయని చెప్పాలి. ఈ ఓటమి ఇచ్చిన రిజల్ట్‌తో ఇప్పుడు ట్రంప్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. గత కొద్దికాలంగా ఇరాన్‌తో జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం, శాంతి ఒప్పందాల విషయంలో ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ చాప్టర్ క్లోజ్ అని తేల్చిచెప్పారు. అంతేకాదు, ఇన్నాళ్లూ ఇరాన్ దౌత్య వ్యవహారాలను చూసుకుంటున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ట్రంప్ ఒక సరికొత్త టార్గెట్ ఇచ్చారు. ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకునేందుకు ట్రంప్ మొదటి నుంచి కఠినమైన వైఖరినే అవలంబిస్తున్నారు. అయితే ఇటీవల ఇరాన్‌తో ఏదైనా శాంతి ఒప్పందం జరుగుతుందేమో అన్న ఊహాగానాలకు ట్రంప్ స్వయంగా చెక్ పెట్టారు. తాజాగా తన సొంత సోషల్ మీడియా వేదికైన ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనం ఇప్పటికే తమకు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని, ఇక కొత్తగా ఒప్పందాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌తో మాకు ఎలాంటి ఒప్పందం అవసరం లేదు. ఆ రోజులు ఎప్పుడో ముగిశాయి. వారి వందల బిలియన్ల డాలర్ల డబ్బు ఇప్పుడు మా చేతుల్లోనే ఉంది. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధి కూడా మా ఆధీనంలోనే ఉంది అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. విదేశీ వ్యవహారాలను పక్కనపెట్టి, ఇప్పుడు ట్రంప్ ఫోకస్ అంతా దేశీయ రాజకీయాల వైపు మళ్లింది. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు ఇంతకాలం నాయకత్వం వహిస్తున్న వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌కు .. ట్రంప్ తాజాగా కొత్త బాధ్యతలు అప్పగించడం అమెరికా పాలిటిక్స్‌లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ వ్యవహారాల ఫైల్స్ క్లోజ్ చేసి, తన పూర్తి సమయాన్ని ఇకపై డెమొక్రాట్ల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో నేరాలు, అవినీతిపై చర్యలకు కేటాయించాలని ట్రంప్ వాన్స్‌కు సూచించారు. మిన్నెసోటా, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ వంటి రాష్ట్రాలను ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు సరిగా పనిచేయడం లేదని, ప్రతి నెలా బిలియన్ల కొద్దీ డాలర్ల ప్రజాధనం అక్రమంగా దారిమళ్లుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రాల్లో అక్రమాలను అరికట్టి, దుర్వినియోగమైన ఫెడరల్ నిధులను తిరిగి రాబడితే.. అమెరికా బడ్జెట్ లోటును భారీగా తగ్గించేందుకు అవకాశం ఉంటుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అంటే ఇరాన్ మీద వాడిన బ్రహ్మాస్త్రాన్ని ఇప్పుడు లోకల్ డెమొక్రాట్ లీడర్ల మీద ప్రయోగించడానికి ట్రంప్ సిద్ధమయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


