కావ్య-అనిరుధ్ చేసుకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ ఏంటి?

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ , అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటయ్యారు. కోట్లాది మంది అభిమానులు ఎదురుచూసిన ఈ పెళ్లి వేడుక గ్రీస్ దేశంలో అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, ఇప్పుడు ఇంటర్నెట్లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి కాకుండా.. వీరు చేసుకున్న పెళ్లి పద్ధతి గురించి ఒక రేంజ్లో చర్చ జరుగుతోంది. భారతీయ సంప్రదాయ పెళ్లిళ్లు అంటే పంతులు , మంత్రాలు చదవడం, హోమం ఇవన్నీ కామన్. కానీ కావ్య, అనిరుధ్ పెళ్లిలో ఇవేమీ లేవు. అవును, వీరు గ్రీస్‌లో చేసుకుంది సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ . ఈ పెళ్లిలో ఎలాంటి మతపరమైన ఆచారాలు లేవు, పురోహితులు లేరు. కేవలం పూలమాలలు, గొలుసులు మార్చుకుని వారు భార్యాభర్తలుగా మారారు. అనిరుధ్-కావ్యల వివాహం గ్రీస్‌లో అత్యంత ప్రైవేట్‌గా జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన వ్యక్తులు, అతికొద్ది మంది రాజకీయ, సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. అసలు వీరి పెళ్లిలో ఎలాంటి ఆచారాలు పాటించారు? అన్న విషయాన్ని పెళ్లికి హాజరైన డీఎంకే నేత టీఆర్బీ రాజా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వివరించారు. కావ్య, అనిరుధ్ ఒకరికొకరు సింపుల్‌గా పూలమాలలు మార్చుకున్నారని ఆయన తెలిపారు. ఈ పెళ్లిలో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వధువు కావ్యకు ఒక గొలుసును అందించగా.. వరుడు అనిరుధ్‌కు ఆయన బంధువు, సూపర్ స్టార్ రజినీకాంత్ మరో గొలుసును అందించారు. అనంతరం వధూవరులు ఒకరికొకరు ఆ గొలుసులను మార్చుకున్నారు. ఎలాంటి వేద మంత్రాలు లేకుండా.. రెండు హృదయాల కలయికకు కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశీర్వాదం అందించారని, అదే వారి వివాహ తంతు అని టీఆర్బీ రాజా పేర్కొన్నారు.
సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్. తమిళనాడులో సామాజిక సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి ప్రారంభించిన స్వాభిమాన ఉద్యమం నుంచి ఈ సరికొత్త వివాహ సంప్రదాయం పుట్టుకొచ్చింది. అప్పట్లో సమాజంలో ఉన్న కుల వివక్షను, మతపరమైన ఆచారాలను, ముఖ్యంగా వివాహాల్లో మతపెద్దల ఆధిపత్యాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తూ ఈ విధానం ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్నే తమిళంలో సుయమరియాదై తిరుమణం అని పిలుస్తారు. దేవుడి పేరుతో, ఆచారాల పేరుతో జరిగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా యువతను చైతన్యపరచడానికి దశాబ్దాల క్రితం పెరియార్ ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ పద్ధతినే ఇప్పుడు ఈ ట్రెండింగ్ కపుల్ కావ్య-అనిరుధ్ తమ పెళ్లికి ఎంచుకున్నారు. కులాలు, మతాలకు అతీతంగా.. కేవలం ఇద్దరు వ్యక్తుల పరస్పర అంగీకారమే పెళ్లికి అసలైన పునాది అని చాటిచెప్పడమే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ ప్రధాన ఉద్దేశం.
దీనికి చట్టపరమైన గుర్తింపు ఉందా అన్న అనుమానం చాలామందికి రావొచ్చు. అప్పటి మద్రాస్ స్టేట్ ముఖ్యమంత్రి అన్నాదురై హయాంలో.. 1967లో హిందూ వివాహ చట్టానికి తమిళనాడులో ఒక కీలక సవరణ చేశారు. దీని ద్వారా ఈ తరహా స్వాభిమాన వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. ఇప్పుడు అనిరుధ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్, కావ్య మారన్ లాంటి ఒక బిలియనీర్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి.. ఎలాంటి మూఢనమ్మకాలకు, ఆచారాలకు తావులేకుండా ఈ స్వాభిమాన వివాహం చేసుకోవడం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.



