కొడంగల్ వేదికగా మెగా రైతు మేళా..!

గత రెండేళ్లుగా ఎల్నీనో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులతో జల సంక్షోభాన్ని మనం చూస్తున్నాం చూశాం. ఇలాంటి గ్లోబల్ వాతావరణ మార్పులను తట్టుకుని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించేలా రైతులను సన్నద్ధం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ వేదికగా..నవంబర్ 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు మెగా రైతు మేళా జరగబోతోంది.
కొడంగల్ లో జరగబోయే ఈ రైతు మేళా రైతుల మహా జాతర. వ్యవసాయ, ఉద్యానవన , పశుసంవర్ధక శాఖలతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం , బ్యాంకింగ్ సంస్థలు, టాప్ విత్తన కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహా మొత్తం 26 ప్రభుత్వ శాఖలు ఇక్కడ తమ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నాయి. మేళా తొలి రోజే వికారాబాద్, నారాయణపేట జిల్లాలు, కొడంగల్ నియోజకవర్గ పరిధి నుంచి సుమారు 7,500 మంది రైతులు ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా వేలాది మంది రైతులకు వ్యవసాయ యూనిట్లు, ఆధునిక పరికరాలను నేరుగా పంపిణీ చేయనున్నారు. గ్రామాల్లో అద్దె ప్రాతిపదికన యంత్రాలు వాడుకునేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లు, పప్పుధాన్యాల మిల్లులు , నూనె గానుగ యూనిట్లు, అలాగే పొలంలో సారాన్ని తెలుసుకునేందుకు భూసార పరీక్ష కార్డులు , ఉద్యానవన శాఖకు సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్లు పెద్ద ఎత్తున రైతులకు సబ్సిడీపై అందించనున్నారు. ఒక రైతు విత్తనం నాటినప్పటి నుంచి పంటను మార్కెట్ లో అమ్మే వరకు అవసరమైన ప్రతి పరిష్కారం ఈ 150 స్టాల్స్ లో దొరుకుతుంది.
హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఒకపక్క వరదలు, మరోపక్క తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాతావరణ మార్పులను తట్టుకోవాలంటే పాత పద్ధతులు పక్కనపెట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లక తప్పదు. దీనికోసమే ఈ మేళాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, జాతీయస్థాయిలో అవార్డులు పొందిన ప్రగతిశీల రైతులతో ప్రత్యేకంగా సాంకేతిక సమావేశాలు , ముఖాముఖి చర్చలు నిర్వహిస్తున్నారు. నీరు తక్కువగా తీసుకునే పంటలు ఏవి? మార్కెట్ లో ఇప్పుడు డిమాండ్ ఉన్న కమర్షియల్ క్రాప్స్ ఏంటి? డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేయడం వల్ల పెట్టుబడి ఎలా తగ్గుతుంది? అనే దానిపై రైతులకు లైవ్ లో అవగాహన కల్పిస్తారు. మన రైతులు టెక్నాలజీని ఎంత త్వరగా అందిపుచ్చుకుంటే, అప్పుల ఊబి నుంచి అంత త్వరగా బయటపడతారు అని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.



