జనవరి 13నే వస్తున్న ‘కాకా’...మరి ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?

సంక్రాంతి పండుగ సీజన్ సినిమాలకు ఎంత పెద్ద సీజనో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా పండుగ సీజన్ లో తమ అభిమాన హీరో సినిమా విడుదల కావాలని కోరుకుంటూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా సంక్రాంతికి వస్తుందంటే అటు అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఉండే జోషే వేరు. కానీ, గత కొన్ని రోజులుగా సంక్రాంతి బరిలో మెగాస్టార్ ఏ సినిమాతో దిగబోతున్నారు అన్న అంశంపై టాలీవుడ్లో ఓ రేంజ్లో గందరగోళం నెలకొంది. ఒకవైపు చిరంజీవి – బాబీ కాంబినేషన్లో వస్తున్న కాకా సినిమా వాయిదా పడి ఏప్రిల్ 7వ తేదీకి వెళ్లిపోతోందని వార్తలు వచ్చాయి.. మరోవైపు విశ్వంభర సినిమాను సంక్రాంతికి రంగంలోకి దించుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దాంతో అసలు సంక్రాంతికి కాకా వస్తుందా, లేక విశ్వంభర వస్తుందా అన్న అయోమయం మెగా అభిమానులను కన్ఫ్యూజ్ చేసింది. అయితే ఈ కన్ఫ్యూజన్ కు తెరదించుతూ కాకా టీమ్ స్పష్టత ఇచ్చేసింది. సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ.. తేల్చిచెప్పేసింది. ముఖ్యంగా ఈ సినిమాకు కీలకంగా పనిచేస్తున్న ప్రముఖ రచయిత కోన వెంకట్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మా లక్ష్యం, మా దృష్టి, మా ప్లాన్ అన్నీ జనవరి 13 మాత్రమే.. అని అత్యంత స్పష్టంగా, ధీమాగా పేర్కొన్నారు కోన వెంకట్. అంతేకాదు, ఈ పోస్ట్‌తో పాటు షూటింగ్ లొకేషన్లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీతో కలిసి ఉన్న ఒక కొత్త ఆన్-లొకేషన్ ఫోటోను కూడా ఆయన పంచుకున్నారు.
కోన వెంకట్ ఇచ్చిన ఆ క్లారిటీకి తోడు, దర్శకుడు బాబీ మరో అడుగు ముందుకేసి అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చారు. అదే ఆన్-లొకేషన్ ఫోటోను షేర్ చేస్తూ, సినిమా విడుదలకు ఏకంగా కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు బాబీ. 47 డేస్ టు కాకా అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఇదే సంక్రాంతి సీజన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి, దర్శకుడు బాబీ భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే సక్సెస్ఫుల్ కాంబినేషన్, మళ్లీ అదే సంక్రాంతి సీజన్లో కాకాతో వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక కాకా సంక్రాంతి బరిలో నిలవడం ఖాయం కావడంతో, మరి విశ్వంభర పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు సంక్రాంతికి విశ్వంభర రావచ్చని ఆశగా ఎదురుచూసిన అభిమానులు, ఇప్పుడు మేకర్స్ తదుపరి ఏం నిర్ణయం తీసుకుంటారా అని ఆసక్తిగా చూస్తున్నారు. సాధారణంగా ఒకే అగ్ర హీరో సినిమాలు రెండూ ఒకే పండగ సీజన్లో విడుదల కావడం చాలా అరుదు. కానీ ఒకవేళ విశ్వంభర కూడా ఇదే సంక్రాంతి సీజన్లో విడుదలై మెగా అభిమానులకు ఊహించని డబుల్ సర్ప్రైజ్ ఇస్తుందా? లేక కాకా కు పూర్తి స్థాయిలో సంక్రాంతి బాక్సాఫీస్‌ను వదిలేసి, విశ్వంభర చిత్రబృందం మరో కొత్త, సోలో విడుదల తేదీని ఎంచుకుంటుందా? అన్నది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా విశ్వంభర మేకర్స్ నుంచి అధికారికంగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేంతవరకు ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.



