ట్రంప్ పని అయిపోయిందా?...ఘోర ఓటమికి కారణాలివే..!

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు అధికార రిపబ్లికన్ పార్టీకి ఊహించని ఫలితాన్నిచ్చాయి. యూఎస్ కాంగ్రెస్ లో డెమొక్రాట్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. తాజా రిపోర్టుల ప్రకారం సెనేట్‌లో , V హౌస్ లో కీలక స్థానాలను డెమోక్రాట్లు వరుసగా గెలుచుకుంటున్నారు. ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ అభ్యర్థులకు ఓటర్లు గట్టి ఝలక్ ఇచ్చారు. ఫలితాల సరళిని ఒకసారి డీప్ గా పరిశీలిస్తే.. జనవరి నాటికి హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పూర్తిగా డెమోక్రాట్ల ఆధీనంలోకి వెళ్లడం ఖాయమైంది. అక్కడ మొత్తం 229 స్థానాల్లో డెమోక్రాట్లు ఆధిక్యంలో ఉండగా, కేవలం 161 స్థానాల్లో మాత్రమే రిపబ్లికన్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కీలకమైన రాష్ట్రాలైన కన్సాస్ లో ఈ సెనేట్ సీటును డెమోక్రాట్ అభ్యర్థి ఆడమ్ హామిల్టన్ గెలుచుకోనున్నారు. టెన్నెస్సి లో మాత్రం రిపబ్లికన్ నేత బిల్ హెగర్తీ తన సేనేట్ సీటును నిలుపుకోగలిగారు. అర్కాన్సాస్ ..ఇక్కడ టామ్ కాటన్ గెలిచి రిపబ్లికన్ల పరువు కాపాడారు. అలాగే గవర్నర్‌గా మళ్లీ రిపబ్లికన్ అభ్యర్థి సారా హకాబీ శాండర్స్ గెలిచారు. న్యూ మెక్సికోలో కొత్త గవర్నర్‌గా డెమొక్రాట్ దెబ్ హాలాండ్ బాధ్యతలు చేపట్టనున్నారు. పెన్సిల్వేనియా .. ఇక్కడ డెమోక్రాట్లు రెండు కొత్త హౌజ్ సీట్లు గెలిచారు. పేగీ కాగ్నెటి, జానెల్లి స్టెల్సన్ లు అద్భుత విజయం సాధించారు. టెక్సాస్‌లో డెమోక్రాట్ అభ్యర్థి విన్సెంట్ గోంజేలేజ్, ఓహియోలో గ్రేగ్ ల్యాండ్స్మాన్ లు ఘన విజయాలు నమోదు చేసి రిపబ్లికన్లను ఖంగుతినిపించారు. రిపబ్లికన్ల కీలకస్థానాలలో ఓటమి తప్పలేదు. ఈ మధ్యంతర ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రుత్ సోషల్ అకౌంట్లో స్పందిస్తూ ఈ ఎన్నికల బ్యాలెట్‌పై నా పేరు లేదు. ఒకవేళ బ్యాలెట్‌పై నేను ఉండి ఉంటే, కచ్చితంగా భారీ మెజారిటీతో మేమే గెలిచేవాళ్లము అని ఒక రకమైన ధిక్కార స్వరం వినిపించారు. ప్రారంభంలో పార్టీ ఓటమికి తానేమీ కారణం కాదన్న రీతిలో, రిపబ్లికన్ అభ్యర్థుల ప్రచార లోపమే, వాళ్ల స్వయంకృతాపరాధమే ఈ ఓటమికి కారణమన్న రీతిలో ఆయన పరోక్షంగా సెటైర్లు వేశారు. ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ పై ఆయన వ్యవహారశైలిపై కొంత అసంతృప్తి వినిపించింది. రిపబ్లికన్ పార్టీని గెలిస్తే తన వల్లే గెలిచారు అని క్రెడిట్ తీసుకునే ట్రంప్, ఓడిపోతే మాత్రం అభ్యర్థుల మీద నెట్టేయడం ఏంటని పార్టీలో సీనియర్లు సైతం ఆయనపై బహిరంగంగానే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్యంతర ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో ట్రంప్ వ్యవహరించిన తీరుపై రిపబ్లికన్లు ఎన్నికల ముందు నుంచే తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కేవలం తనకు అనుకూలంగా ఉండే వాళ్లకు, తన మాట వినే వాళ్లకు మాత్రమే ఆయన టికెట్లు ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సేనేట్‌లో కూడా రిపబ్లికన్లు పట్టు కోల్పోతుండటంతో ట్రంప్ ఒంటెద్దు పోకడలపై స్వంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. రిపబ్లికన్లకు ఎంతో పట్టు ఉన్న స్థానాల్లో కూడా డెమోక్రాట్లు ఈజీగా గెలవడంతో ట్రంప్ కు గ్రౌండ్ రియాలిటీ ఏంటో అర్థమైంది.


