దద్దరిల్లిన ఇజ్రాయెల్ అసెంబ్లీ…అసలేం జరిగింది..?

ఇటీవల ఇజ్రాయెల్‌లో జరిగిన ఎన్నికల తర్వాత ఆ దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రధానిగా ఎన్నికైన రిటైర్డ్ జనరల్ ఐసెన్‌కోట్ చేతిలో ఉంది. ఆయనకు 67 మంది చట్టసభ సభ్యుల మద్దతు ఉంది. ఈ గ్యాప్‌లో ఆపద్ధర్మ ప్రధానిగా నెతన్యాహు కొనసాగుతున్నారు. పార్లమెంట్ ప్రారంభ సెషన్లో భాగంగా.. ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న అంతర్జాతీయ ఒత్తిళ్ల గురించి వివరిస్తూ నెతన్యాహు నేషనల్ యూనిటీ కోసం పిలుపునిచ్చారు. కానీ ఆయన మాట్లాడుతున్న సమయంలోనే ఆయన ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అరబ్ పార్టీలైన జాయింట్ లిస్ట్, రామ్ పార్టీలను టెర్రరిస్టుల మద్దతుదారులుగా అభివర్ణించారు. వాళ్లతో కలిసి ఐసెన్‌కోట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. సరిగ్గా ఆ సమయంలోనే మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు నాఫ్తాలీ బెన్నెట్ అమాంతం లేచి నిలబడ్డారు. నేషనల్ యూనిటీ గురించి మాట్లాడే ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ నెతన్యాహును అడ్డుకున్నారు. అక్టోబర్ 7 దాడికి సంబంధించి స్టేట్ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ ఎందుకు వేయలేదు? ఖతార్ దేశాన్ని శత్రుదేశంగా ఎందుకు ప్రకటించలేదు? అసలు మీ ఖతారీ సలహాదారుల కథేంటి? అంటూ బెన్నెట్ సంచలన ఆరోపణలు చేశారు. పీఎం ఆఫీసులో పనిచేస్తున్న నెతన్యాహు సలహాదారులు ఇద్దరు, ఖతార్ ప్రయోజనాల కోసం వారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలను బెన్నెట్ డైరెక్ట్‌గా సభలో లేవనెత్తడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ప్రధాని జవాబు ఇచ్చేలోపే పైన విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న నెతన్యాహు సతీమణి సారా నెతన్యాహు తన సీట్లో నుంచి లేచి నిలబడి, కింద ఉన్న నాఫ్తాలీ బెన్నెట్‌ను వేలు చూపిస్తూ తీవ్రస్థాయిలో అరిచి గీపెట్టారు. ఒక దేశ మాజీ ప్రధానిని ఉద్దేశించి ఆమె ఘాటైన పదజాలం వాడారు. సారా నెతన్యాహు మాత్రమే కాదు, సభలో ఉన్న నెతన్యాహు మద్దతుదారులు, ఫార్-రైట్ మంత్రులు కూడా ఆమెకు వంతపాడారు. ముఖ్యంగా జాతీయ భద్రతా శాఖ మంత్రి ఇటామర్ బెన్-గ్వీర్ , లికుడ్ పార్టీ చైర్మన్ ఒఫిర్ కాట్జ్ కూడా బెన్నెట్‌పై విరుచుకుపడ్డారు. అరబ్ జాయింట్ లిస్ట్ వాళ్లతో కలిసి కూర్చునే నీకు, ఇక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తూ మాట్లాడే హక్కు ఎక్కడుంది? అంటూ బెన్-గ్వీర్ కేకలు వేశారు. దీనికి బెన్నెట్ కూడా అంతే ధీటుగా సమాధానం ఇవ్వడంతో పార్లమెంట్ లో రసాభాసగా మారిపోయింది. దేశ అత్యున్నత చట్టసభలో ఇలాంటి ఒక వీధి గొడవ జరుగుతుంటే.. ఏం చేయాలో పాలుపోని నెతన్యాహు, ఆ గొడవ సద్దుమణిగే వరకు ప్రసంగాన్ని ఆపి సైలెంట్‌గా నిలబడిపోయారు. అక్టోబర్ ఎన్నికల సమయంలో అరబ్ ఓటర్ల టర్న్అవుట్ పెంచడానికి ఖతార్ భారీగా డబ్బులు ఖర్చు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు హమాస్ ఉగ్రవాదులకు ఖతార్ దేశం మద్దతు ఇస్తోంది. అలాంటి దేశాన్ని శత్రుదేశంగా ప్రకటించకపోగా, నెతన్యాహు ఆఫీసులోని వ్యక్తులే ఖతార్ నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు ఇజ్రాయెల్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. మరోవైపు, అక్టోబర్ 7న హమాస్ దాడి చేసిన ఘటనలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వైఫల్యం పై ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని వేయాలని స్వయంగా ఐసెన్‌కోట్ , ఇతర విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టారు. కానీ నెతన్యాహు కావాలనే దాన్ని దాటవేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఐసెన్‌కోట్ , ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెతన్యాహు ప్రసంగం అత్యంత సిగ్గుచేటు అని, అది విద్వేషపూరితంగా సాగిందని ఆయన మండిపడ్డారు. ఈ గొడవ తర్వాత నెతన్యాహు మరొక్క నిమిషం కూడా పదవిలో ఉండేందుకు అనర్హుడు అని ఆయన కుండబద్దలు కొట్టారు. నెతన్యాహు అహంకారాన్ని నిరసిస్తూ.. బుధవారం నాడు లికుడ్ పార్టీతో జరగాల్సిన ఒక కీలకమైన చర్చల సమావేశాన్ని కూడా ఐసెన్‌కోట్ రద్దు చేసుకున్నారు .రాబోయే నెల రోజులు ఇజ్రాయెల్ రాజకీయాలకు అత్యంత కీలకం. ఐసెన్కోట్కు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో ఆరు వారాల సమయం మాత్రమే ఉంది.



